IND vs NZ: మళ్లీ అదే బ్యాటింగ్.. 24 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి వైట్‌వాష్!
మళ్లీ మళ్లీ అదే బ్యాటింగ్.. అదే నిలకడలేని ఆటతీరు.. ముంబై టెస్టులోనూ బెంగళూరు, పూణే టెస్టుల ఫలితమే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడవ టెస్ట్ మ్యాచ్‌లోనూ భారత్ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. భారత బ్యాటర్లలో రిషభ్ పంత్ (64) మినహా ఎవరూ రాణించలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో 147 పరుగుల లక్ష్య సాధనలో భారత్ ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం 121 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో 25 పరుగుల తేడాతో మరో ఓటమిని మూటగట్టుకుంది. మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ వైట్‌వాష్ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అవమానకర ఓటమి!
స్వదేశంలో జరిగిన రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లతో కూడిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు వైట్‌వాష్‌కు గురికావడం 24 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కివీస్ చేతిలో 0-3 తేడాతో ఓడిపోవడంతో గత 24 ఏళ్ల తర్వాత తిరిగి వైట్‌వాష్ రిపీట్ అయింది. చివరిసారిగా 2000లో టీమిండియా ఈ పరాభవాన్ని ఎదుర్కొంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0తో గెలుచుకుంది. ఆ సిరీస్‌లో ముంబైలో జరిగిన మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో, బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌ను ఇన్నింగ్స్, 71 పరుగుల తేడాతో కైవసం చేసుకుంది. ఆ సిరీస్‌లో భారత జట్టు అత్యంత పేలవంగా ప్రదర్శన చేసింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా 250 ప్లస్ పరుగుల మార్కును దాటలేకపోయింది.