IPL – 2025: ఆర్సీబీకి మరోసారి కోహ్లీ కెప్టెన్ అవుతాడా?
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం అన్ని జట్టులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఎవరిని వదులుకోవాలని ప్రాంఛైజీలు తర్జన భర్జన పడుతున్నాయి. ఇందుకోసం ఆయా జట్లు రిటెన్షన్ జాబితాను ప్రకటించడానికి అక్టోబర్ 31 తుది గడువు. ఈనేపథ్యంలో స్టార్ ఆటగాళ్ల చుట్టూ పలు ఆసక్తికర కథనాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ అభిమానులకు కిక్కెక్కించే వార్త ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఐపీఎల్‌లో బెంగళూరు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లి మరోసారి జట్టుకు సారథ్యం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
విరాట్ అంగీకరిస్తాడా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అయినా ఆ జట్టుకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఆ జట్టులో ప్రధాన ఆకర్షణ. అతడు కెప్టెన్సీ బాధ్యతలు వదులుకొని బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. గత మూడు సీజన్లుగా జట్టును ఫాప్ డుప్లెసిస్ నడిపిస్తున్నాడు. అయితే.. మెగా వేలానికి ముందు డుప్లెసిస్‌ను రిటెయిన్ చేసుకోవడానికి ఆ జట్టు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఆ జట్టుకు కొత్త కెప్టెన్ రావడం ఖాయం. ఇక గతంలో జట్టును ముందుండి నడిపించిన కోహ్లీ పేరే ఈ జాబితాలో ప్రధానంగా వినిపిస్తోండటం గమనార్హం. మరోవైపు అభిమానులు కూడా కోహ్లీని మరోసారి ఆర్సీబీ సారథ్య బాధ్యతల్లో చూడాలని ఆసక్తిగా ఉన్నారు. మరి విరాట్ అందుకు అంగీకరిస్తాడా లేదో తెలియాల్సి ఉంది.