Rohit Sharma: ఊహాగానాలకు చెక్.. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ క్లారిటీ!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. రోహిత్ శర్మకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ ట్రోఫీ సందర్భంగా ఆయనపై వచ్చినన్ని రూమర్స్, విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఫామ్ లేమి కారణంగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఒక సందర్భంలో కోచ్ గంభీర్ సీనియర్ ప్లేయర్లతో పాటు రోహిత్‌పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక, ఏకంగా చివరిదైన ఐదో టెస్టులో రోహిత్ శర్మను తప్పించిన కారణంగా గంభీర్‌పై రోహిత్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. గంభీర్‌పై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలోనే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. అయితే తాజాగా ఆ వార్తలపై రోహిత్ స్పందించారు. తనకు ఇప్పుడే రిటైర్మెంట్ ఆలోచనలే లేదన్నారు.
ఎప్పుడు ఏం చేయాలో తెలుసు!
రోహిత్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘నేను రిటైర్మెంట్ తీసుకోవడం లేదు. సిడ్నీ టెస్టు నుంచి మాత్రమే విశ్రాంతి తీసుకున్నా. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను. కీలకమైన పోరులో ఫామ్‌తో ఇబ్బందిపడే ప్లేయర్లు వద్దని నేను గంభీర్‌కు సూచించాను. ఇది చాలా సున్నితమైన నిర్ణయమే. కానీ, మాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యం.. ఆ తర్వాతే నేను. మీడియాలో వస్తున్నట్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి సమస్యలు లేవు. అలాంటి ప్రచారాన్ని మనం నియంత్రించలేం. ఇప్పుడు నేను పరుగులు చేయలేకపోయా. కానీ, రాబోయే ఐదు నెలల్లో పరుగులు చేయనని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. ఫామ్ కోసం నిరంతరం శ్రమిస్తా. ల్యాప్‌ట్యాప్‌లు, పేపర్, పెన్నులను ముందేసుకొనేవారు నేను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలి? ఎప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించలేరు. నేను ఇద్దరు పిల్లల తండ్రిని.. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసు.’ అని అన్నారు.