తెలుగు
te తెలుగు en English
Linkin Bioక్రికెట్

Rohit Sharma: హింట్ ఇచ్చిన హిట్ మ్యాన్.. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారా?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. సుమారు 17 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నారు. అన్ని ఫార్మట్లలోనూ అత్యుత్తమ ప్లేయర్‌గానే కాదు, బెస్ట్ కెప్టెన్‌గానూ ప్రశంసలందుకున్నారు. ఇక, 2024 టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత టీ 20 ఫార్మట్‌కు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మట్లకు కెప్టెన్‌గా ఉన్నారు. అయితే రోహిత్ శర్మ.. కొన్నాళ్లుగా టెస్టుల్లో సరైన ఫామ్ చూపించలేకపోతున్నారు. వరుసగా ఫెయిల్ అవుతున్నారు. అదీకాకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వరుస వైఫల్యాలపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

13 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 152 పరుగులే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీలో పెర్త్ టెస్టు గెలిచిన తర్వాత రోహిత్ శర్మ రాగానే టీమిండియా మళ్లీ ఓటమి బాట పట్టడంతో అతని కెప్టెన్సీలోనే సమస్య ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇక రోహిత్ వ్యక్తిగత పర్‌ఫార్మెన్స్ సైతం ఆశాజనకంగా లేదు. బ్రిస్బేన్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రోహిత్.. 27 బంతుల్లో 10 పరుగులకే అవుట్ అయ్యారు. గత 13 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రోహిత్ శర్మ చేసింది కేవలం 152 పరుగులే కావడం గమనార్హం. ఇక, ఈ క్రమంలోనే రోహిత్ శర్మ టెస్టు ఫార్మట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు జోరందుకున్నాయి.

నిజంగానే హింట్ ఇచ్చారా?

బ్రిస్బేన్ టెస్టులో ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుటైన రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చే సమయంలో తన చేతి గ్లవ్స్‌ తీసి బౌండరీ లైన్ బయట అడ్వటైజ్‌మెంట్ బోర్డు దగ్గర ఆరబెట్టి రావడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బ్యాటర్లు అవుటైన తర్వాత తమ గ్లవ్స్‌‌ని తమతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌కి తీసుకెళ్తారు. కేవలం నాటౌట్‌గా నిలిచి, బ్రేక్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఇలా బౌండరీ లైన్ దగ్గర పెట్టి వెళ్తారు. అలాంటిది రోహిత్ అవుట్ అయ్యాక తన గ్లవ్స్‌ని బౌండరీ లైన్ అవతల పెట్టడంతో రిటైర్మెంట్ గురించి హింట్ ఇచ్చారని కొందరు అంటున్నారు. మరికొందరేమో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత రోహిత్.. కేవలం టెస్టు కెప్టెన్సీ నుంచి మాత్రమే తప్పుకుంటారని, రిటైర్మెంట్ ఉద్దేశం లేదని చర్చించుకుంటున్నారు. నిజానికి స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాతి నుంచే టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని రోహిత్ శర్మ నిర్ణయించుకున్నారని, కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రోద్బలం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కెప్టెన్సీ చేస్తున్నారని కూడా వినిపిస్తోంది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button