Rohit Sharma: మేం నలుగురమయ్యాం.. శుభవార్తను పంచుకున్న హిట్ మ్యాన్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. మరోసారి తండ్రి అయ్యారు. ఆయన సతీమణి రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తను స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు హిట్ మ్యాన్. ‘మేం నలుగురమయ్యాం’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఫ్యామిలీ అని రాసి ఉన్న ఒక ఫొటోను పంచుకున్నారు. ఈ నెల 15న, శుక్రవారం తమకు రెండో బిడ్డ జన్మించినట్లు పేర్కొన్నారు.
టెస్ట్ సిరీస్ ఆడతారా?
రోహిత్ శర్మ – రితికా దంపతులకు ఇప్పటికే సమైరా అనే కుమార్తె ఉంది. రితికాను రోహిత్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015 డిసెంబర్ 13న వీరి వివాహం జరిగింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సమయంలోనే ఆ జంటకు మొదటి బిడ్డ జన్మించింది. 2018 డిసెంబరు 30న వీరి జీవితంలోకి సమైరా వచ్చింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. కానీ, రోహిత్ శర్మ మాత్రం భారత్‌లోనే ఉండిపోయాడు. తన భార్య రెండో కాన్పు నేపథ్యంలోనే అతడు ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. పెర్త్‌లో జరిగే తొలి టెస్టులో అతడు ఆడతాడో లేదో చూడాలి. ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే.. బుమ్రా కెప్టెన్సీలో టీమ్‌ఇండియా తొలి టెస్టు ఆడే అవకాశాలు ఉన్నాయి.