Sports Awards: ద్రవిడ్, బుమ్రాలకు అర్హత లేదా..? జాతీయ క్రీడా అవార్డుల్లో క్రికెట్‌పై వివక్ష దేనికి?
జాతీయ క్రీడా పురస్కారాలు క్రీడాకారుల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. తాము పడిన కష్టానికి దక్కిన గుర్తింపుగా క్రీడాకారులు ఈ అవార్డులను భావిస్తారు. ఈ క్రమంలోనే కేంద్రం ఏటా ప్రకటించే ఈ పురస్కారాల కోసం యావత్ క్రీడాలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది. అయితే 2024 ఏడాదికి గానూ కేంద్ర ప్రభుత్వం జనవరి 2న ప్రకటించిన క్రీడా పురస్కారాల్లో క్రికెట్‌కు చోటు దక్కకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని ఆటల్ని సమానంగా చూడాల్సిన ప్రభుత్వం క్రికెట్ విషయంలో ఎందుకు చిన్నచూపు చూస్తోందని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.
క్రికెట్ అంటే చిన్నచూపు?
2024లో సుదీర్ఘ కాలం తర్వాత టీమిండియా టీ 20 ప్రపంచ కప్ సాధించింది. ఈ విజయానికి మార్గదర్శకత్వం వహించిన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఈసారి కచ్చితంగా ద్రోణాచార్య అవార్డు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కేంద్రం రాహుల్‌కు మొండిచేయి చూపించింది. ఇక, 17 ఏళ్ల తర్వాత టీమిండియా టీ 20 ప్రపంచ కప్ గెలవడంలో బుమ్రా పాత్ర కూడా ఎంతో కీలకం. అలాగే గడిచిన ఏడాది టెస్ట్, టీ 20 ఫార్మాట్లలో బుమ్రా అద్భుత ప్రదర్శనతో అలరించారు. 2024లో టెస్టుల్లో 71 వికెట్లు, టీ20 ప్రపంచ కప్‌లో 15 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించారు. అయినా బుమ్రా పేరు ఖేల్ రత్న పురస్కార జాబితాలో లేదు. ఈ నేపథ్యంలో పలువురు క్రికెట్ విశ్లేషకులు, క్రికెట్ ఫ్యాన్స్ కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జాతీయ అవార్డులకు రాహుల్ ద్రవిడ్, బుమ్రాలకు అర్హత లేదా? క్రికెట్‌పై ఎందుకీ వివక్ష అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
జనవరి 17 అవార్డుల ప్రదానం
కాగా.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో మొత్తం 32 మందిని అర్జున అవార్డు వరించింది. వీరిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. ఐదుగురికి ద్రోణాచార్య అవార్డు, ఇద్దరు క్రీడాకారులను జీవితకాల అర్జున అవార్డు గ్రహీతలుగా ప్రకటించారు. వీరికి జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేయనున్నారు.