తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Virat Kohli: విరాట్ కోహ్లీపై రాబిన్ ఊతప్ప సంచలన ఆరోపణలు!

టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ కెరీర్ అర్ధాంతరంగా ముగియడానికి, 2019 వరల్డ్ కప్‌కి రాయుడు సెలెక్ట్ కాకపోవడానికి అప్పుడు జట్టు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీనే కారణమన్నారు. ‘విరాట్ కోహ్లీకి ఎవ్వరైనా నచ్చకపోతే, లేదా సరిగ్గా ఆడడం లేదని అనిపిస్తే వెంటనే అతన్ని టీమ్ నుంచి తప్పిస్తాడు. ఈ విషయంలో అంబటి రాయుడు మంచి ఉదాహరణ. రాయుడి కెరీర్‌ అర్ధాంతరంగా ముగియడం నన్ను చాలా బాధపెట్టింది. ప్రతీ కెప్టెన్‌కి కొందరు నచ్చిన ప్లేయర్లు ఉంటారు, అందులో తప్పు లేదు. కానీ కెరీర్‌లో చాలా లేటుగా ఎదుగుతున్న అంబటి రాయుడిని ఇలా టీమ్ నుంచి తప్పించడం మాత్రం అన్యాయం. అంబటి రాయుడికి వరుసగా అవకాశాలు ఇచ్చి, నాలుగో స్థానంలో ఆడిస్తూ వచ్చారు. సడెన్‌గా వరల్డ్ కప్‌లో ప్లేస్ లేకుండా చేశారు.’ అని అన్నారు.

2019లో ఏం జరిగిందంటే..?

2019 వన్డే వరల్డ్ కప్ టీమ్‌కి అంబటి రాయుడిని సెలక్ట్ చేయకపోవడం చాలా పెద్ద దుమారమే రేపింది. అంబటి రాయుడిని కాదని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ని టీమ్‌కి సెలక్ట్ చేసిన చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, అతను బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ఉపయోగపడే 3D ప్లేయర్ అంటూ కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యల తర్వాత వరల్డ్ కప్ మ్యాచులు చూసేందుకు 3D గ్లాసెస్ ఆర్డర్ చేశానంటూ ట్వీట్ చేశాడు అంబటి రాయుడు. ఈ ట్వీట్ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. శిఖర్ ధావన్, విజయ్ శంకర్ గాయంతో టోర్నీకి దూరమైన తర్వాత కూడా అంబటి రాయుడికి పిలుపు దక్కలేదు. దీంతో అతను ఆవేశంతో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించినా టీమ్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే అంబటి రాయుడు మాత్రం ఈ విషయంలో ఎప్పుడూ విరాట్ కోహ్లీపై ఆరోపణలు చేయలేదు. కేవలం చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వల్లే తన కెరీర్‌కి సరైన ముగింపు దక్కలేదని, తన ఆవేశంతో వరల్డ్ కప్ ఆడే అవకాశం కోల్పోయానని భావించాడు. కానీ రాబిన్ ఊతప్ప.. విరాట్ కోహ్లీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button