Final: నేడే ప్రో కబడ్డీ ఫైనల్ మ్యాచ్..! విజయం ఎవరికి దక్కేనో?
గత రెండు నెలలుగా కబడ్డీ అభిమానుల్ని అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్-11వ సీజన్ తుది పోరుకు సిద్ధమైంది. పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు హర్యానా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ తుది పోరులో తలపడనుంది. వరుసగా రెండోసారి హర్యానా ఫైనల్ చేరగా.. ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ను దక్కించుకున్న పట్నా నాలుగోసారి టైటిల్ కోసం సర్వశక్తులు ఒడ్డనుంది.
నువ్వా.. నేనా?
యంగ్ ప్లేయర్స్ దేవాంక్ దలాల్, అయాన్ లోచాబ్ రాణించడంతో వరుస విజయాలతో ఫైనల్‌కు వచ్చిన పైరేట్స్.. అదే జోష్‌లో ట్రోఫీని దక్కించుకోవాలని చూస్తోంది. హర్యానా తరఫున శివమ్ పాతరె, వినయ్, జైదీప్‌లపై భారీ అంచనాలను అభిమానులు పెట్టుకున్నారు. అయితే, యూపీ యోధాస్‌తో జరిగిన సెమీఫైనల్లో కీలక పాయింట్లు సాధించి జట్టును ఫైనల్ కు చేర్చిన శివమ్, వినయ్ ఈ మ్యాచ్‌లోనూ రాణించాలని హర్యానా స్టీలర్స్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఇక, డిఫెన్స్‌లో రాహుల్, సంజయ్‌లు కూడా కీలకం కానున్నారు.