World Chess Champion: చరిత్ర సృష్టించిన గుకేశ్.. భారత సరికొత్త ఛాంపియన్!
భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించారు. చివరిదైన 14వ గేమ్‌లో చైనాకు చెందిన లిరెన్‌ను ఓడించిన గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నారు. అంతేకాదు, 18 ఏళ్లకే గుకేశ్ ఈ ఘనత సాధించి మరో చరిత్ర సృష్టించారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న భారత రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. 2012 తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా నిలిచారు.
ఎత్తుకు పైఎత్తు!
నిజానికి బుధవారమే తేలాల్సిన ఈ ఫలితం.. ప్రత్యర్థులిద్దరి హోరాహోరీ పోరుతో ఈ రోజుకు వాయిదా పడింది. సుమారు 5 గంటల పాటు సాగిన 13వ రౌండ్‌లో ప్రత్యర్థులిద్దరూ చెరో పాయింట్‌ను పంచుకున్నారు. విజయం కోసం గుకేశ్ గట్టిగానే ప్రయత్నించినా.. 32 ఏళ్ల లిరెన్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దాంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. దీంతో చెరో 6.5 పాయింట్లతో మ్యాచ్ డ్రా అయ్యింది. ఇవాళ జరిగిన 14వ రౌండ్‌లో విజయంతో ఒక పాయింట్ సాధించిన గుకేశ్ 7.5తో విజేతగా నిలిచారు. ఇంతకీ ఈ సరికొత్త ఛాంపియన్ ఎవరో కాదు, తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందినవాడే కావడం గమనార్హం.