తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP- JSP Alliance: తెగని టీడీపీ, జనసేన సీట్ల పంచాయితీ.. పార్టీల నేతల్లో గుబులు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార వైసీపీ సభలు సమావేశాలతో ముందుకు దూసుకెళ్తోంది. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, పాలనను వివరిస్తూ.. సీఎం సిద్ధం సభలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించి ఆరు జాబితాలను కూడా ప్రకటించారు. దీనివల్ల ఎన్నికల ప్రచారాన్ని ఎక్కవగా నిర్వహించి.. వీలైనంత ఎక్కువగా ప్రజల్లో తిరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే క్షేత్రస్థాయిలోనూ వైసిపికి సానుకూల పవనాలు వీస్తున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు ఇంకా ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ఈ పార్టీల అధినేతలు ఇంకా చర్చలు జరుపుతున్నారు. ఇదే విషయమై ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ రెండుసార్లు సమావేశమయ్యారు. ఉండవల్లోని చంద్రబాబు నివాసంలో ఇరువురు నేతలూ 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అంతకుముందు మధ్యాహ్నం భేటీ అయిన జనసేనాని దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటుపై తుది కసరత్తులో భాగంగా.. మరోసారి రాత్రి తొమ్మిది గంటలకు సమావేశమయ్యారని అంటున్నా.. ఇరు పార్టీలు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీచేయాలని అనుకుంటున్నట్టు సమచారం. దీంతో ఒకేరోజు రెండు సార్లు భేటీ కావడంపై ఏపీలో పొలిటికల్‌ చర్చకు దారి తీసింది. ఇక సీట్ల పంపకాల విషయం ఎటూ తేలకపోవడంతో ఈనెల 8న మళ్లీ సమావేశం కావాలని నేతలు నిర్ణయించుకున్నారట.

Also read: AP Budget Sessions: ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం

ఏటూ తేలని సీట్ల పంపకాలు:

అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? ఎక్కడ ఎవరు బరిలో నిలవాలనే అంశంపై ఈ భేటీలో నేతలిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు నచ్చజెప్పనున్న ఆ పార్టీ అధిష్ఠానం.. వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని హామీ ఇవ్వనుందని తెలుస్తోంది. అలాగే, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చి పవన్‌ కల్యాణ్‌ వారికి నచ్చజెప్పనున్నారట. ఇరు పార్టీల ఆశావహులకు నచ్చజెప్పిన తర్వాత రెండు పార్టీలూ పోటీచేసే స్థానాల సంఖ్య, అభ్యర్థులపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం స్థానిక కార్యకర్తలు తమ స్థానాలను త్యాగం చేసేందుకు ససేమిరా అంటున్నారట. దీంతో అధినేతలకు ఈ వ్యవహారం తలనొప్పిలా మారింది.

Also read: AP Government: పరిశ్రమలకు ప్రభుత్వం ఊతం.. ఫార్మాహబ్ గా ఏపీ

మరి రెండుసార్లు జరిగిన చంద్రబాబు, పవన్‌ల సమావేశం సారాంశమేంటి? అసలు కీలక అంశాలపై స్పష్టత వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. అయితే కొన్ని స్థానాల్లో రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉండడం కారణంగా.. సీటు దక్కని వారికి సర్దిచెప్పాలని పవన్ నిర్ణయం తీసుకున్నారట. పొత్తులతో కొంచెం కష్టంగా ఉంటుందని.. సీట్ల సర్దుబాటు కొంతమందికి బాధ కలిగిస్తుందని అన్నారు. టీడీపీతో పొత్తు, సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని ‎ఇబ్బందులు ఉంటాయన్నారు. నేతలంతా నమ్మకంతో తన వెనుక నడవాలని కోరారు. ఇక రెండోసారి సమావేశంలో మేనిఫెస్టోపై చర్చించినట్లు సమాచారం. మేనిఫెస్టోను భారీ బహిరంగ సభ ద్వారా రిలీజ్ చేయాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. ఏయే అంశాలతో మేనిఫెస్టో ఉండాలనే దానిపై ఇద్దరి మధ్య క్లారిటీ వచ్చినట్లు సమాచారం. మొత్తంగా సుదీర్ఘ సమావేశాల అనంతరం సీట్ల సర్దుబాటుపై దాదాపు స్పష్టత వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button