తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: ‘ఫ్యామిలీ స్టార్’

Pakka Telugu Rating : 2.25
Cast : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, జగపతిబాబు, దివ్యాంశ కౌశిక్, వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ తదితరులు
Director : పరశురాం
Music Director : గోపి సుందర్
Release Date : 05/04/2024

‘గీతా గోవిందం’ సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండకు ఆ స్థాయి హిట్ మళ్లీ పడలేదు. అప్పటి నుంచి సరైన హిట్ కోసం విజయ్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కథల విషయంలో కొంచెం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. గతేడాది లవ్ & ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ డ్రామాతో తెరకెక్కిన ‘ఖుషీ’ మూవీ కూడా మ్యూజికల్‌గా హిట్ అయినా, బాక్సీఫీస్ వద్ద మాత్రం మిక్స్‌డ్ టాక్‌ తెచ్చుకుంది. దీంతో విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీపైనే నమ్మకం పెట్టుకున్నారు. విజయ్‌కి ‘గీతాగోవిందం’తో ఫ్యామిలీ ఆడియన్స్‌ని దగ్గర చేసిన పరశురాం ఈ మూవీకి డైరెక్టర్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ మూవీ ఇవాళ విడుదలైంది. మరి ‘ఫ్యామిలీ స్టార్’తో విజయ్, పరశురాం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించారు. ‘సీతారాం’, ‘హాయ్ నాన్న’ మూవీలతో వరుసగా హిట్‌లు అందుకున్న మృణాల్ ఠాకూర్ ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టిందా..! ఆ వివరాలు చూద్దాం.

కథ

హీరో గోవర్దన్ (విజయ్ దేవరకొండ) ఓ మధ్య తరగతి అబ్బాయి. హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తుంటాడు. గోవర్దన్‌ది చాలా పెద్ద కుటుంబం. నానమ్మ, ఇద్దరు అన్నయ్యలు, వదినలు, వారి పిల్లల్లు అందరూ కలిసే ఉంటారు. పెద్దన్నయ్య మద్యానికి బానిస కావడం, చిన్నన్నయ్య ఇంకా జీవితంలో స్థిరపడకపోవడంతో కుటుంబ బారాన్నంతా గోవర్దనే మోస్తాడు. సివిల్ ఇంజనీర్‌గా తనకు వచ్చే చాలీచాలని జీతంతోనే కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అయితే తన కుంటుంబం జోలికి ఎవరైనా వస్తే మాత్రం గోవర్దన్ ఎంతదాకైనా వెళ్తాడు. ఇదిలా ఉండగా గోవర్దన్ జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్) వస్తుంది. గోవర్దన్ ఇంటి పెంట్‌హౌజ్‌లోనే ఇందు రెంట్‌కి దిగుతుంది. గోవర్దన్‌తో, ఆయన ఫ్యామిలీతో ఇందు చక్కగా కలిసిపోతుంది. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. తన ప్రేమ విషయాన్ని ఫ్యామిలీతో పాటు, చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలిసేలా ఓరోజు గోవర్దన్ ప్లాన్ చేస్తాడు. ఇంతలో అతని చేతికి ఓ పుస్తకం అందుతుంది. దానిని చూసి గోవర్దన్ షాక్ అవుతాడు. ఇందుపై కోపంతో రగిలిపోతాడు. ఆమె చెంప చెళ్లుమనిపిస్తాడు. మరి ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది? ఇందు గోవర్దన్‌ని నిజంగా ప్రేమించలేదా? అసలు ఎవరీ ఇందు? అతని జీవితంలోకి ఆమె ఎందుకు వచ్చింది? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

కథనం-విశ్లేషణ

కథ పరంగా చూస్తే.. పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ ఇది. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు, సమస్యలు ఏంటి? మిడిల్ క్లాస్ అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలన్నీ మనం చాలా సినిమాల్లోనే చూశాం. ఈ మూవీలోనూ అదే కనిపించింది. మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిగా విజ‌య్ దేవ‌ర‌కొండ చేసే విన్యాసాలతో క‌థ మొద‌ల‌వుతుంది. డబ్బును ఆదా చేయడం కోసం హీరో పడే పాట్లు చూస్తే చాలా కృత్రిమంగా అనిపిస్తుంది. సివిల్ ఇంజనీర్‌గా నెలకు లక్ష రూపాయలు సంపాందించే హీరో మిడిల్ క్లాస్ ఎలా అవుతాడని మూవీ చూసిన అందరికీ అనిపిస్తుంది. పైగా ఇంట్లో పిల్లల తిండి విషయంలో, చిన్న చిన్న ఖర్చుల విషయంలో హీరో యాక్టింగ్ కొంచెం ఓవర్‌గా అనిపిస్తుంది. చివరకు హీరోయిన్ తనను కాలేజీ వద్ద బైక్ పైన డ్రాప్ చేయమని అడిగితే లీటర్ పెట్రోల్ కొట్టిస్తే డ్రాప్ చేస్తానని చెప్పడం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. దర్శకుడు పరశురాం ఈ కథను మరింత బలంగా రాసుకొని ఉండాల్సింది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఆప్యాయత, అనురాగం వంటివి ఇందులో పెద్దగా కనిపించలేదు. పెద్దగా ట్విస్టులు కూడా ఏమీ లేవు.

హీరోయిన్ మృణాల్.. విజయ్ దేవరకొండపైనే పుస్తకం ఎందుకు రాయాలనుకుంటుంది? పైగా అతనితో అంత ఈజీగా ప్రేమలో ఎందుకు పడుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానం కనిపించదు. వీటికి సెకండాఫ్‌లో సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినా అవి పెద్దగా ఆకట్టుకోవు. హీరోయిన్‌పైన కక్ష సాధించేందుకు హీరో రిచ్ మ్యాన్‌లా మారిపోవడం, తన కుటుంబ సభ్యుల్ని రిచ్ చూపించడం, హీరోయిన్‌కి ఫోన్ చేసి తన ఈగోను సంతృప్తిపరుచుకోవడం ఏమాత్రం ఆకట్టుకోవు. అమెరికా నేప‌థ్యంలో సాగే ద్వితీయార్ధంలోని చాలా స‌న్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. ఇందు థీసిస్ ప్ర‌సంగం, ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు కాస్త ఆకట్టుకుంటాయి. మిడిల్ క్లాస్ కుటుంబాలను ప్రభావితం చేసేలా అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ మాత్రం పరవాలేదు. అయితే బలమైన, భావోద్వేగమైన సన్నివేశాలేవీ ఇందులో కనిపించవు. ఇక క్లైమాక్స్ కూడా సాదాసీదాగా ఉంది.

నటీనటులు

మిడిల్ క్లాస్ అబ్బాయిగా విజయ్ దేవరకొండ గోవర్దన్ పాత్రలో బాగా నటించాడు. పాత్రకు తగ్గట్టుగా చాలా సింపుల్‌గా, కొత్తగా కనిపిస్తాడు. మూవీలో డైలాగ్‌లకు పెద్దగా స్కోప్ లేకపోయినా మిడిల్ క్లాస్ జీవితాల గురించి ఫస్టాఫ్‌లో విలన్‌తో గొడవ సమయంలో గానీ, హీరోయిన్‌తో గొడవ సమయంలోగానీ విజయ్ డైలాగ్ డెలివరీ బాగుంది. ఇక మృణాల్ ఠాకూర్ ఇందు పాత్రకు న్యాయం చేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెర పైన ఇద్దరి జోడీ బాగుంది. ఒకరకంగా చెప్పాలంటే కొన్ని చోట్ల విజయ్ దేవరకొండను డామినేట్ చేసిందనే చెప్పాలి. జ‌గ‌ప‌తిబాబు, వెన్నెల కిశోర్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులంతా వారి పాత్రల పరిధి మేరకు నటించారు. అయితే వెన్నెల కిషోర్ కామెడీని, సహజంగానే ఆయన కామెడీ టైమింగ్‌ని దర్శకుడు పెద్దగా వాడుకోలేదు. దివ్యాంశ కౌశిక్ అయితే ఆ పాత్ర ఎందుకు చేసిందో తెలీదు. రోహిణి హ‌ట్టంగ‌డి పోషించిన బామ్మ పాత్ర మిన‌హా మిగిలిన పాత్ర‌లేవీ బ‌లంగా లేవనే చెప్పాలి.

సాంకేతిక వర్గం

సినిమా చాలా స్లోగా సాగుతుంది. పైగా కొంచెం నిడివి కూడా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తన కత్తెరకు మరి కాస్త పనిచెప్పాల్సింది. బ్యాక్ రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) పెద్దగా ఆకట్టుకోదు. రిలీజ్‌కి ముందు మూవీకి హైప్ తీసుకొచ్చిన ‘కళ్యాణి వచ్చా వచ్చా’ సాంగ్ ఎండ్ టైటిల్స్ పడ్డాక రావడం ప్రేక్షుకుడిని నిరాశకు గురిచేస్తుంది. గోపీ సుందర్‌ మ్యూజిక్ పరవాలేదు. అయితే నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు ఏ మాత్రం వెనకడుగు వేయనట్లుగా తెరపై కనిపించింది.

ప్లస్ పాయింట్స్

  • విజయ్ దేవరకొండ, మృణాల్ జోడీ
  • కొన్ని సంభాషణలు

మైనస్ పాయింట్స్

  • రొటీన్ కథ
  • కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • బోర్ కొట్టించే కొన్ని సీన్లు

పంచ్ లైన్: విజయ్ స్టార్ తిప్పని ‘ఫ్యామిలీ స్టార్’!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button