తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: గామి

Pakka Telugu Rating : 3/5
Cast : విశ్వక్‌సేన్, చాందినీ చౌదరి, మహమ్మద్‌, హారిక, అభినయ, తదితరులు
Director : విద్యాధర్ కాగితాల
Music Director : నరేశ్ కుమారన్, స్వీకర్ అగస్తీ
Release Date : 08/03/2024

చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. గతేడాది తన సొంత బ్యానర్‌లో నిర్మించి, తానే దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా దమ్కీ’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తన తాజా చిత్రం ‘గామి’పేనే విశ్వక్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇవాళ మహాశివ రాత్రి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. విశ్వక్‌సేన్‌ కెరీర్ తొలి నాళ్లలో మొదలుపెట్టిన సినిమా ఇది. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయిక. దర్శకుడు విద్యాధర్, విశ్వక్ కలిసి చేసిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ఎలా ఉందో ఓసారి చూద్దాం.

కథ, కథనం:

శంకర్ (విశ్వక్ సేన్) ఒక అఘోరా. మనిషి స్పర్శ తగిలితే తన శరీరం వింత మార్పులకు లోనవుతుంది. ఎవరైనా పొరపాటున తాకితే శంకర్ ఒళ్లంతా నీలం రంగులోకి మారిపోతుంది. సృహ తప్పి పడిపోతాడు. ఈ సమస్య తనకు ఎలా వచ్చింది, తన గతం ఏంటి అనేది కూడా శంకర్‌కి గుర్తు ఉండదు. ఇతడి వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని మిగతా అఘోరాలు అందరూ ఇతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొడతారు. తన సమస్యకు పరిష్కారం కోసం అన్వేషిస్తూ ఒక స్వామీజీని కలుస్తాడు. తన సమస్యకు పరిష్కారం ముప్పై ఆరేళ్లకోసారి హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతాల్లో పూసే మాలిపత్రాల్లో ఉందని తెలుసుకుంటాడు. డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు. మాలి పత్రాలు సాధించడంలో అతనికి ఎదురైన అవరోధాలేంటి, వాటిని శంకర్ ఎలా అధిగమించాడు? శంకర్ ఆలోచనల్లో వచ్చే దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ-333 (మహమ్మద్ సమాద్) ఎవరు? వంటి విషయాల్ని తెరపైనే చూడాలి.

విశ్లేషణ:

చాలా రోజులుగా తెలుగు సినీ ప్రేక్షకులు తమ పంథా మార్చుకున్నారు. రొటీన్ లవ్, ఎంటర్టైన్మెంట్ కథల్ని ఏమాత్రం ఆదరించడం లేదు. ఆ లెక్కన డైరెక్టర్ విద్యాధర్ ఇలాంటి ఓ సరికొత్త కథను ఎంపిక చేసుకొని మంచి పనిచేశారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా నచ్చదు కానీ, కొత్తదనం కోరుకునే వారికి తప్పక నచ్చుతుంది. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ వండర్‌గా నిలిచాయనే చెప్పాలి. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. హరిద్వార్‌లో అఘోరాల ఆశ్రమంలో ఉండే ఒకడిగా శంకర్‌ని చూపించి నేరుగా కథ మొదలుపెట్టేశారు. హీరోకి ఉన్న సమస్య గురించి వివరించడం, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా ఓ సాధువు.. శంకర్‌కి చెప్పడం, దీంతో హీరో పరిష్కారం కోసం హిమాలయాలకు వెళ్లేందుకు సిద్ధం కావడం.. ఇలా సీన్లన్నీ చకాచకా సాగిపోతూ ఉండటంతో ప్రేక్షకుడు థ్రిల్ ఫీల్ అవుతాడు. హిమాలయాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల సీన్లలో సాగదీత, లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది.

మనుషులపై ప్రయోగాల నేపథ్యంలో జరిగే కథ చాలా ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. సీటీ 333పై జరిగే ప్రయోగాలు, అతను అక్కడి నుంచి పారిపోవడానికి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. అభినయ, తన కూతురు ఉమ కథ ఈ సినిమాకు కోర్ పాయింట్. శంకర్ కథకు ఈ రెండు కథల్ని చివర్లో ఒకదానితో మరొకటి ముడిపెట్టిన తీరు అద్భుతంగా ఉంది. మూడు జీవిత కథల్ని సమాంతరంగా చూపిస్తూ ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది. కొత్త తరహా సినిమాలు తమిళం, మలయాళంలో వచ్చినంత తెలుగులో రావు అన్న విమర్శకు ఈ సినిమా సరైన సమాధానం.

నటీనటులు

ఈ సినిమాలో శంకర్ పాత్రలో విశ్వక్‌సేన్ జీవించాడనే చెప్పాలి. ఎమోషనల్ సీన్లలో విశ్వక్ చాలా అద్భుతంగా నటించాడు. ఎప్పటి నుంచో ప్రాధాన్యం గల పాత్ర కోసం వెతుకుతున్న చాందినీ చౌదరికి ఇందులో తాను కోరుకున్న పాత్రే దక్కింది. జాహ్నవి పాత్ర కోసం చాందిని పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. సీటీ 333 పాత్రలో మహ్మద్ సమద్, ఉమ పాత్రలో నటించిన హారిక కూడా అద్భుతంగా నటించారు.

సాంకేతిక వర్గం

డైరెక్టర్ విద్యాధర్‌కి ఇది మొదటి సినిమానే అయినా అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు ప్రేక్షకుడిని ప్రతిచోట ఇంప్రెస్ చేస్తాడు. ఈ సినిమా చూస్తే అసలు విద్యాధర్ కి ఇది నిజంగానే మొదటి సినిమానా అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ తన కెమెరాతో సినిమాకు ప్రాణం పోశారు. నరేష్ కుమారన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో హైలెట్. క్లైమ్యాక్స్‌లో వచ్చే శివమ్ సాంగ్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది.

ప్లస్ పాయింట్స్

  • విశ్వక్‌సేన్ నటన
  • బలమైన, కొత్త కథ
  • విజువల్ ఎఫెక్ట్స్
  • క్లైమాక్స్ ఎపిసోడ్

మైనస్ పాయింట్స్

  • కొన్ని సీన్ల సాగదీత
  • లాజిక్‌ లేని కొన్ని సీన్లు

పంచ్ లైన్:

గామితో విశ్వక్ సేన్ సరికొత్త గేమింగ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button