తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

YSRCP Manifesto 2024: గత పథకాలకు మళ్లీ చోటు.. మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్!

వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. 2019లో ఇచ్చిన పథకాలను కొనసాగిస్తూనే వాటికి ఇచ్చే నిధులను కొంత పెంచుతూ మేనిఫెస్టోలో చోటు కల్పించారు. ప్రస్తుతం వైసీసీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే మళ్లీ అవే పథకాలను కొనసాగిస్తూ.. మరో తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను రూపొందించారు. గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్‌ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమం అమలు చేశామని సీఎం జగన్‌ చెప్పారు.

మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు..

నవరత్నాల పేరిట అమలు చేస్తున్న పథకాల విస్తరణ.. తొమ్మిది ముఖ్యమైన హామీలతో కూడిన వైసీపీ 2024 మేనిఫెస్టోను సీఎం జగన్ చదివి వినిపించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక భద్రత వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. అనంతరం రెండు పేజీలతో కూడిన వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్‌ విడుదల చేశారు.

  1. రెండు విడతల్లో పెన్షన్‌ రూ.3,500 దాకా పెంపు
  2. అమ్మ ఒడి, విద్యాకానుక, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు
  3. వైఎస్సార్‌ చేయూత పథకం 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు
  4. అమ్మ ఒడి రెండు వేలకు పెంచుతాం. రూ. 17వేలు చేస్తాం. తల్లుల చేతికి రూ.15 వేలు అందిస్తాం
  5. వైద్యం, ఆరోగ్యశ్రీ విస్తరణ
  6. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కొనసాగింపు.. నాలుగు దఫాల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు
  7. నాలుగు దఫాల్లో ఈబీసీ నేస్తం 45 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంపు
  8. వైస్సార్‌ రైతు భరోసా రూ.16 వేలు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపు
  9. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.3 లక్షల రుణం
  10. లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు.. రూ. 10 లోల వరకు ప్రమాద బీమా
  11. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కొనసాగింపు
  12. అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు

ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత..

మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథమని, 2019లో ఇచ్చిన వాగ్దానాలను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి అమలు చేశామన్నారు. ఈ మేనిఫెస్టోను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉంచి మరీ అమలు చేశామని చెప్పారు. ఐదేళ్లలోనే మేనిఫెస్టోకు ప్రాధాన్యత తీసుకొచ్చామన్నారు. నవరత్నాల పాలనకు ఈ మేనిఫెస్టో అద్దంపడుతుందని జగన్ తెలిపారు. 2.75 లక్షల కోట్లు నేరుగా ఇచ్చామన్నారు. ఇది ఒక హిస్టరీ అని అన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా పథకాలన్నింటినీ డోర్ డెలివరీ చేశానని తెలిపారు. గతంలో ఈ మేనిఫెస్టో అమలు చేయడం సాధ్యమేనా అని కొందరు ప్రశ్నించారని, కానీ 99 శాతం మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేశామని తెలిపారు. రాజకీయాల్లో ప్రజలకు మాట ఇస్తే నమ్ముతారని, ఆ ఆశతోనే ఓటేస్తారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button