తెలుగు
te తెలుగు en English
జాతీయం

AICC: సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ గురి.. మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా పి. చిదంబరం

సార్వత్రిక ఎన్నికలు 2024 కోసం జాతీయ కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో అధికారం సాధించటమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా కీలకమైన కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసి దానికి కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరాన్ని ఛైర్మన్‌గా నియమించింది.

మేనిఫేస్టో కమిటీలో 16 మంది సభ్యులు ఉంటారు. కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్‌ మాజీ డిప్యూటీ సీఎం టీఎస్‌ సింగ్‌దేవ్‌ ఉండనున్నారు. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆనంద్‌ శర్మ, జైరామ్‌ రమేశ్‌, శశిథరూర్‌ ఉండనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ గురువారం ఢిల్లీలో జరగ్గా.. శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టో కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది.

Also read: Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిరసన.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

అయితే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల 2024 కోసం ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర మాజీ మంత్రులతో పాటు ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చీఫ్ ప్రవీణ్ చక్రవర్తితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత, మణిపూర్ మాజీ డిప్యూటీ సీఎం గైఖాంగమ్, లోక్‌సభలో ఆ పార్టీ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ కూడా కమిటీలో ఉన్నారు. ఎన్నికల కోసం పార్టీ ఎజెండాను ఖరారు చేసే కీలక ప్యానెల్‌లోని ఇతర సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కె రాజు, ఓంకార్ సింగ్ మార్కం, రంజీత్ రంజన్, జిగ్నేష్ మేవానీ, గుర్దీప్ సప్పల్ ఉన్నారు.

ఇక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగాలు అనుసరించిన వ్యూహాలపై రాహుల్‌గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిలో చిన్న పార్టీలతో సీట్ల సర్దుబాటుకు తమ పార్టీ అంగీకరించి ఉండాల్సిందని చెప్పుకొచ్చారు. ఈ మూడు కీలకమైన రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంపై ఢిల్లీ వేదికగా గురువారం నాడు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. బీజేపీని ఓడించేందుకు చిన్న పార్టీలతో ఆయా రాష్ట్రాల్లో ఎందుకు పొత్తు పెట్టుకోలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుకు అంగీకరించి ఉంటే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీజేపీపై విజయం సాధించేందుకు మనకు ప్రతి ఓటు కీలకమేనని తెలిపారు. అలాగే, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ తగిన స్థాయిలో ప్రచారం చేయలేదన్నారు. తెలంగాణలో ఏడాది కిందట మూడో స్థానంలో ఉన్నప్పటికీ మంచిగా పుంజుకొని విజయం సాధించడాన్ని రాహుల్ గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button