తెలుగు
te తెలుగు en English
జాతీయం

BJP: హైదరాబాద్ లో మాదిగ విశ్వరూప సభ.. ఎస్సీ వర్గీకరణపై మోడీ ప్రకటన ఉండనుందా?

మరో 20 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రచారాలు, సభలు, సంచలన ప్రకటనలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్రంలో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే నవంబర్ 11న మాదిగలతో మాదిగ విశ్వరూప సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా సా. 4 గంటల నుంచి సభ ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరై మాదిగలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని సమాచారం.

ఎస్సీ వర్గీకరణపై ప్రకటన ఉంటుందా?

రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇందుకు సంబంధించి 2014 లో బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చర్చ జరిపి తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అలాగే పలు దఫాలుగా ఈ అంశంపై బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో చర్చించింది. ఈ విషయమై రాష్ట్రంలో కూడా ఎన్నోసార్లు ఆందోళనలు జరిగాయి. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఈ అంశంపై దృష్టి సారించాలని కేంద్రానికి తెలిపినట్టు సమాచారం. దీంతో తెలంగాణలోనూ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ ఓటర్లు తమవైపు తిప్పుకునే అంశంలో భాగంగా ఎస్సీ వర్గీకరణకు సముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

తాజాగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో ఎస్సీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నామో ప్రధాని స్వయంగా వివరించారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణతోపాటు, రిజర్వేషన్ల పెంపు అంశంపై ప్రకటన వస్తుందని.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఢిల్లీ వర్గాలు తెలుపుతున్నాయి. అందులో భాగంగానే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా కీలక ప్రకటన చేస్తారని అందరూ భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button