తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Etala Rajender: కాంగ్రెస్ గూటికి ఈటెల.. వార్తల్లో నిజమెంతా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెందారు. తన సొంత నియెజకవర్గమైన హుజురాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో.. ఛాలెంజ్ చేసి మరీ పోటీకి దిగిన గజ్వేల్‌లో దారణంగా ఓడిపోయారు. రెండుచోట్లా రెండో స్థానానికి పరిమితమయ్యారు. గజ్వేల్‌లో ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం ఈటల రాజేందర్ మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనడం లేదు. ఈ క్రమంలో బీజేపీకి షాకిచ్చేలా ఓ ఫొటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇటీవల బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో కలిసి ప్రైవేట్ సమావేశంలో పాల్గొన్నారు.

Also read: Karnataka Government: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు వ్యాపారాలు

ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కీలకంగా చర్చించినట్లు సమచారం. ఈ క్రమంలోనే ఈటల పార్టీని వీడబోతున్నారంటూ వార్తలు విస్తృతమయ్యాయి. కాంగ్రెస్‌లో చేరిక ఖరారు అయితే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కరీంనగర్ నుంచి బరిలో నిలవబోతున్నారని తెలుస్తోంది. ఇక మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో అదే జోరును కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలోకి కీలక నేతలను చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఐదారుగురు కీలక నేతలు హస్తం తీర్థం పుచ్చుకోగా.. ఈటల కూడా చేరితే కాంగ్రెస్‌కు మరింత బలం పెరుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సర్వేలు సైతం లోక్‌సభలో కాంగ్రెస్‌కే మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈటల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా.. ఈటల రాజేందర్ పార్టీ మార్పు వార్తలపై ఆయన ముఖ్య అనుచరులు స్పందించారు. తరచూ పార్టీలు మారే వ్యక్తిత్వం ఈటలకు లేదని అన్నారు. బీజేపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా కాంగ్రెస్ నాయకులను కలిశారని స్పష్టం చేశారు. ఈటల పార్టీ మార్పు వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button