తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Dharani Portal: సమస్యల కుప్పగా ధరణి… కాంగ్రెస్ పోరుబాట

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 30 న జరగనుండడంతో దాదాపు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను కాంగ్రెస్ ఎత్తిచూపే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ధరణి పోర్టల్ పై మాటల యుద్దం ఊపందుకుంది. ధరణి పోర్టల్ పూర్తిగా మోసపూరితమని కాంగ్రెస్ అంటుంటే… అందులో అవినీతికి ఆస్కారమే లేదని బీఆర్ఎస్ గట్టి నమ్మకంతో చెబుతుంది. తెలంగాణలో భూ రికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందించినదే ‘ధరణి పోర్టల్‌’. 2020 అక్టోబర్ 29వ తేదీన‌ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు.

అసలు ధరణి ఎందుకంటే?

ఆస్తి రిజిస్ట్రేషన్లను మొత్తం విధానాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ పోర్టల్‌ను తెచ్చింది. ఆస్తి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా.. ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలకు ధరణి పోర్టల్ ఒక గమ్యస్థానంగా ఉంది. వ్యవసాయ, వ్యవసాయేతర ప్రాపర్టీలు రెండింటికీ ఈ ధరణి పోర్టల్ వర్క్ చేస్తుంది. పాత ఓనర్ పాస్‌బుక్‌ను అప్ డేట్ చేసి, కొనుగోలుదారునికి కొత్త పాస్ బుక్ ఇస్తున్నారు. వ్యవసాయేతర భూములకు మెరూన్ రంగు పాస్ బుక్, వ్యవసాయ భూములకు గ్రీన్ రంగు పాస్ బుక్‌లను జారీ చేస్తున్నారు.

కిలాడి లేడీ ఉపాయం

నల్గొండ జిల్లాలో ధరణి పోర్టల్ ప్రారంభమైన రెండవ రోజే తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించింది ఓ మహిళ. 2019లో ఒక ఎకరం 34 గుంటల భూమిని విజయ లక్ష్మి అనే మహిళ జగదీశ్ అనే వ్యక్తికి విక్రయించింది. జగదీష్ ఆ తర్వాత ఆ భూమికి మ్యూటేషన్ చేయించుకోలేదు. ఇక ఇదే ఆసరాగా చేసుకున్న ఆ మహిళ ఏకంగా ధరణి పోర్టల్ ద్వారా ఆ భూమిని తిరిగి తన కుమార్తె పేరు పై రిజిస్ట్రేషన్ చేయించింది. ఇది తెలుసుకున్న జగదీష్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమం వెలుగులోకి వచ్చింది. ఇదే కాకుండా కుటుంబానికి తాత, తండ్రుల నుంచి వచ్చిన భూమి వివరాలు సరిగ్గా లేకపోవడంతో అమ్మిన వారి పేరు మీదే ధరణి పోర్టల్ లో భూమి ఉండటం… కొన్న వారి పేరు మీదకి రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గొడవలకు దారితీస్తున్న ధరణి

తమ భూమి ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడానికి అధికారుల చుట్టు తిరగాల్సి వస్తుంది. ఒక వేళ భూమి ఎవరి పేరు మీద ఉందో తెలిసిన వారు మళ్ళీ వీళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడానికి కొందరు డబ్బులు డిమాండ్ చేయగా మరికొందరు ఒప్పుకోకపోవడంతో గొడవలు కూడా జరుగుతున్నాయి. భూమి విషయంలో వారి సరిహద్దులు తెలిసిన కూడా తమది అని చెప్పుకోలేని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. మరో విషయం ఏంటంటే రైతు బంధు భూమి ఎవరి పేరు మీద ఉంటే వారి ఖాతాలోనే జమా అవుతుండడంతో రెండు విధాలుగా నష్టపోతున్నారు. ఇలాంటి నష్టాలు మరెన్నో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ధరణికి వ్యతిరేకంగా పోరాడుతుంది.

బంగాళఖాతంలో వేస్తాం రేవంత్ రెడ్డి

ధరణిలోని లోపాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తుంది. అందుకే తాము అధికారంలోకి వచ్చాక ధరణిని బంగాళఖాతంతో వేస్తామని… ధరణి కంటే మంచి పోర్టల్ ని తీసుకువస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణిని కేసీఆర్ కు ఏటీఎంగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. ధరణి వచ్చాక 35 లక్షల ఎకరాల దళిత, గిరిజన భూములను కొల్లగొట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రెవెన్యూ శాఖలో ఉన్న వివరాల ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తారని తెలిపారు. గతంలో రైతు రుణమాఫీ, పంట నష్టం చెల్లించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు.

సమస్యల ధరణి అంటున్న ప్రజలు

తెలంగాణ ప్రజలు కూడా ధరణి పోర్టల్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ పాస్ బుక్ పై వారికి ఉన్న మొత్తం భూమి ఎక్కలేదని దాని కోసం అధికారుల చుట్టు నిత్యం తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణి లోని లోపాలను కొందరు బ్రోకర్లు వారికి అనుగుణంగా మార్చుకోని నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని మాయమాటలు చెప్పి డబ్బులు గుంజుతున్నారు. గ్రామాలలో భూమిల గురించి పంచాయితీలు జరగడం వల్ల కూడా డబ్బు నష్టపోతున్నామని మండిపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పటేల్, పట్వారీ వ్యవస్తే నయం అని ప్రజలు వారి అభిప్రాయాలను వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button