తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Medaram Jathara: గద్దెపై కొలువుదీరిన సమ్మక్క.. నేడు మేడారానికి గవర్నర్, సీఎం

మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టనుంచి కుంకుమ భరణి రూపంలో బయల్దేరి వచ్చిన సమ్మక్క గద్దెపై కొలువుదీరింది. సమ్మక్కను ప్రధాన పూజారి ప్రతిష్ఠించారు.. ఆ సమయంలో ఆలయప్రాంగణమంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోయింది. భక్తులు సమ్మక్క- సారాలమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. నేడు ఒక్కరోజు అమ్మవార్లు గద్దెలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు భక్తుల దర్శనం అనంతరం మళ్లీ సమ్మక్క, సారాలమ్మలు వనప్రవేశం చేయనున్నారు.

Also read: Minister Ponnam Prabhakar: సిద్ధిపేట సబ్ స్టేషన్లో అగ్నిప్రమాదం.. విచారణకు మంత్రి పొన్నం ఆదేశం

మరోవైపు మేడారం జాతర భక్తులతో కిటకిటలాడుతోంది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు మేడారానికి పోటెత్తారు. సమ్మక్క-సారలమ్మ నామస్మరణలతో వనం పులకరించిపోతోంది. సమ్మక్క రాక సందర్భంగా మేడారంలోని ఆమె గుడిని శుద్ధి చేశారు. మామిడి తోరణాలు కట్టారు. ఆవరణ మొత్తం ఎర్రమన్నుతో అలికి, ముగ్గులు పెట్టారు. అమ్మవారికి మంత్రులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా తల్లి గౌరవార్థం జిల్లా ఎస్పీ మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. కోయలు ప్రత్యేక పూజలు, ఆటల పాటలతో స్వాగతం పలికారు. కాగా.. ఇప్పటికే సారమ్మను ఆదివాసీ పూజారులు కొమ్మ బూరలు ఊదుతూ, డోలు వాయిద్యాలతో గద్దెపై కొలువుదీర్చారు. పగిడిద్దరాజు, గోవిందరాజులు సైతం గద్దెలపై కొలువుదీరారు. చివరగా సమక్క రాకతో జాతరలో కీలక ఘట్టం పూర్తైంది. సమక్క గద్దెపైకి చేరడంతో భక్తులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి గద్దెలను దర్శించుకుంటున్నారు.

మరోవైపు మేడారం సమ్మక్క- సారాలమ్మను దర్శించుకునేందుకు నేడు మేడారానికి గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గవర్నర్ తమిళిసై అమ్మవార్లను దర్శనం చేసుకోనున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం రానున్నారు. అలాగే కేంద్రమంత్రి అర్జున్ ముండా కూడా మేడారం సమ్మక్క- సారాలమ్మను దర్శనం చేసుకోనున్నారని మంత్రి సీతక్క వెల్లడించారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి మేడారం వస్తుండటంతో ఆలయ పూజారులు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అలాగే పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button