తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Vijayashanthi: కాంగ్రెస్ గూటికి రాములమ్మ.. ముహుర్తం ఫిక్స్?

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రాములమ్మ కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఖాయమైంది. గురువారం హస్తం పార్టీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఆ వ్యూహం బెడిసి కొడుతోంది. కొత్త నేతలు చేరకపోగా.. ఉన్న నేతలే పార్టీని వీడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్.. ఇప్పుడు విజయశాంతి అదే బాట పట్టారు.

విజయశాంతి కొంతకాలంగా బీజేపీ తీరుతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అందుకే పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. రాములమ్మ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్నా ఎక్కడా ఖండించలేదు. తొలుత ఆమె అసెంబ్లీ బరిలో ఉంటారని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ, అభ్యర్దుల ఎంపిక ప్రక్రియలో విజయశాంతి ప్రస్తావన మాత్రం ఎక్కడా కనబడలేదు.

విజయశాంతి కొన్నిరోజుల క్రితం చేసిన ట్వీట్ సైతం తన మనసులో మాట ఏంటో స్పష్టం చేసేలా ఉంది. కేసీఆర్‌ నుంచి తెలంగాణను కాపాడుకునేందుకు కొందరు కాంగ్రెస్‌లో చేరాలని కోరుతున్నారని.. మరికొందరు బీజేపీలోనే ఉండమంటున్నారని ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఇద్దరి అభిప్రాయం తెలంగాణ మేలు కోసమేనని.. సినిమాల్లో లాగా రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదని ట్వీట్ చేశారు.

ఈ ఎన్నికల్లోనే విజయశాంతిని గజ్వేల్ నుంచి బరిలోకి దించేందుకు కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత మెదక్ నుంచి పార్టీ ఎంపీ అభ్యర్దిగా దింపాలని పార్టీ భావించినా.. కామారెడ్డి నుంచి రేవంత్ పోటీ చేస్తుండగా.. వేళ విజయశాంతిని గజ్వేల్ నుంచి రంగంలోకి దింపితే హస్తం పార్టీకి కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారట. ఇందుకు విజయశాంతి సైతం సై అన్నట్లు తెలుస్తోంది. దీంతో, గజ్వేల్ నుంచి ఇప్పటికే ప్రకటించిన నర్సారెడ్డి స్థానంలో విజయశాంతిని బరిలోకి దింపటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నర్సారెడ్డికి భవిష్యత్ గురించి పార్టీ నుంచి స్పష్టమైన హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో, ఈ నిర్ణయం పైన కాంగ్రెస్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button