తెలుగు
te తెలుగు en English
క్రికెట్

CWC 2023: కుప్పకూలిన లంక టాప్ ఆర్డర్.. పాక్ ఇక ఇంటికే!

వన్డే వరల్డ్ కప్ లో నేడు శ్రీలంక, న్యూజీలాండ్ జట్ల మధ్య ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సెమీస్ కు అర్హత సాధించాలనే పట్టుదలతో కివీస్ బౌలర్లు రెచ్చిపోయారు. దాంతో లంక జట్టు 171 పరుగులకే కుప్పకూలింది.

కాగా ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీ నుంచి వైదొలిగిన లంక జట్టు ఈ మ్యాచ్ లో గెలవాలనే పట్టుదల ఏ మాత్రం కనిపించలేదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆజట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ ఐదో బంతికి ఓపెన‌ర్ ప‌థుమ్ నిస్సంక‌(2) ను సౌథీ పెవిలియ‌న్ చేర్చాడు. అనంతరం ట్రెంట్ బౌల్ట్.. ఒకే ఓవ‌ర్లో కెప్టెన్ కుశాల్ మెండిస్(6), స‌మ‌ర‌విక్ర‌మ (1)ను ఔట్ చేసి వారిని మరింత కష్టాల్లోకి నెట్టాడు.

మరో ఎండ్ నుంచి కుషాల్ పెరీరా(51) ధాటిగా ఆడినా.. అతను ఔటయ్యాక లంక ఇన్నింగ్స్ టెస్ట్ మ్యాచ్‌ను తలపించింది. చ‌రిత అస‌లంక‌(8), మాథ్యూస్(0), ధనంజ‌య డిసిల్వా(4), చమిక కరుణరత్నే(6) వెంటవెంటనే ఔటయ్యారు. ఆఖరిలో మహీష తీక్షణ(39 నాటౌట్), దిల్షాన్ మధుశంక(19) జోడి పోరాడడంతో ఆ మాత్రం స్కోర్ రాబట్టారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా.. లాకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర రెండేసి వికెట్లు తీసుకున్నారు.

మరోవైపు నేటి మ్యాచ్ లో శ్రీలంక ధాటిగా ఆడి.. న్యూజీలాండ్ జట్టును ఓడించాలనుకున్న పాకిస్థాన్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. శ్రీలంకను తక్కువ స్కోర్ కే కట్టడి చేయడంతో పాటు కివీస్ ఈ మ్యాచ్ లో గెలిస్తే.. మంచి రన్ రేట్ సాధిస్తుంది. దీంతో సెమీస్ కు వెళ్లేందుకు అవకాశాలు మెరుగవుతాయి. ఇక పాకిస్థాన్ జట్టు తర్వాత మ్యాచ్ ఇంగ్లాండ్ పైన గెలిచినా.. భారీ విజయం సాధిస్తే తప్పా.. సెమీస్ కు వెళ్లే అవకాశాలు దాదాపు శూన్యం. దీంతో పాక్ ఆశలు ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button