తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Ramoji Rao: అక్షరయోధుడు రామోజీరావు అస్తమయం

ఈనాడు మీడియా సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు ఇక లేరు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రామోజీ పట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు రామోజీరావు మృతికి నివాళులు అర్పిస్తున్నారు. మీడియా రంగంలో విశేష సేవలందించిన రామోజీరావుకు నివాళికి తెలుగు చిత్ర పరిశ్రమ రేపు షూటింగులకు సెలవు ప్రకటించింది.

‘ఈనాడు’తో జర్నలిజంలో కొత్త వెలుగులు

పాత్రికేయంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసిన రామోజీ రావు.. 1974 ఆగస్టు 10న విశాఖలో ‘ఈనాడు’కు ఊపిరి పోశారు. వార్తల ప్రచురణ నుంచి పేపర్ విక్రయం దాకా తన సొంత శైలితో ముందుకెళ్లారు. అప్పటిదాకా ఉదయాన్నే పత్రిక ముఖం చూడని విశాఖ వాసులు ఈనాడు పత్రిక కోసం ఎగబడ్డారు. తన మార్కెటింగ్ నైపుణ్యాలతో పత్రిక సర్క్యులేషన్‌ను అనతి కాలంలోనే రామోజీరావు పెంచేశారు. ఏడాది గడిచిందో లేదో… 1975, డిసెంబర్ 17న ఈనాడు రెండో ఎడిషన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. పత్రిక సర్క్యులేషన్‌ను ఒక్కసారిగా 50 వేల మార్కును దాటించారు. మరో రెండేళ్లకు 50 వేల సర్క్యులేషన్‌తో విజయవాడ ఎడిషన్‌ను కూడా అట్టహాసంగా ప్రారంభించారు. ఇక నాలుగేళ్లలో పత్రిక మొత్తం సర్క్యులేషన్ లక్ష దాటించేశారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఎడిషన్లతో ఈనాడు పత్రిక నడుస్తోంది. సినీరంగంలోనూ ఎన్నో అద్భుతాలు సృష్టించారు.

ALSO READ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎన్డీయేను డిమాండ్ చేస్తారా?

సినిమాలపై ఆసక్తితో..

సినిమాలంటే కదిలే బొమ్మలు మాత్రమే కాదని మనసులు కదిలించే బొమ్మలంటూ ఉషా కిరణ్‌ మూవీస్‌ సంస్థను స్థాపించారు. దానిపై వివిధ భాషల్లో 87 చిత్రాలను నిర్మించి ఎంతోమంది కొత్త నటీనటులను రంగుల పరిశ్రమకు పరిచయం చేశారు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీని ప్రారంభించారు. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నెట్‌వర్క్‌గా ఈటీవీ విస్తరించింది. ప్రతిక్షణం ప్రపంచ వీక్షణం పేరిట 13 భాషల్లో వార్తలు అందించారు. తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌, ఈటీవీ తెలంగాణ ఛానళ్లు ప్రారంభించారు. విశ్వసనీయ వార్తా ఛానళ్లుగా ఈటీవీ న్యూస్‌ ఛానళ్లను తీర్చిదిద్దారు.

రేపు అంత్యక్రియలు

రామోజీరావు అంత్యక్రియలు రేపు హైదరాబాద్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

సంబంధిత కథనాలు

Back to top button