తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TSRTC: ఆర్టీసీ సిబ్బందిపై దాడి.. సజ్జనార్ సీరియస్ వార్నింగ్

కొత్తగూడెంలో బస్సు డ్రైవర్‌పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్‌ను ప్రయాణికులు దూషించడంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ‘టీఎస్ ఆర్టీసీకి సిబ్బంది వెన్నుముక. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషితో సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే అధికారులు ఈ ఘటనలపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడంతోపాటు విచారణ చేపట్టారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహకరించి, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం.’ అని ట్విట్టర్(X) వేదికగా పోస్ట్ చేశారు.

ALSO READ: సింగరేణి ఎన్నికల్లో ఎర్రజెండా రెపరెపలు.. పత్తా లేని బీఆర్ఎస్

ఒకే రోజు.. రెండు సంఘటనలు

భద్రాచలం డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు బుధవారం కొత్తగూడెం వెళ్తోంది. ఈ సమయంలో ఫుట్ బోర్డు మీద నిలబడి ఉన్న ప్రయాణికులను బస్సు లోపలికి రావాలని మహిళా కండెక్టర్ సూచించినా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో బస్సు నిలిపివేశారు. దీంతో మహిళా ప్రయాణికులు ఆమెను దూషించడంతో మనస్తాపానికి గురై ఆ మహిళా కండెక్టర్ కన్నీళ్లు పెట్టుకుంది. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బుధవారం ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్లు దాడిచేశారు. బస్సు కోసం వెయిట్ చేసిన ప్రయాణికులు ఆటోల్లో వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. ఇంతలోనే అక్కడకు బస్సు రావడంతో ఆటోనుంచి దిగి బస్సు ఎక్కేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్‌ కె.నాగరాజుపై దాడిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button