తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 20: చరిత్రలో ఈరోజు

చిర్రావూరి లక్ష్మీనరసయ్య జన్మదినం

తెలంగాణ విమోచనోద్యమ యోధుడు, కమ్యూనిస్టు నేత చిర్రావూరి లక్ష్మీనరసయ్య 1915లో ఖమ్మం నగరం కైకొండాయిగూడెంలో జన్మించారు. 1931 మార్చిలో భగత్ సింగ్‌ను ఉరితీసిన సందర్భంలో విజయవాడలో నిరసన కార్యక్రమాల్లో పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. 1945లో ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభలో సంస్థ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. వీర తెలంగాణ సాయుధ పోరాటం అన్ని దశల్లోనూ పాల్గొని 1950లో అరెస్టయ్యారు. 1952లో జైలులో నుండే ఖమ్మం మున్సిపల్‌ వార్డు మెంబర్‌గా నామినేషన్‌ వేసి గెలిచారు. అప్పటి నుంచి 1981 వరకు అన్ని పరోక్ష ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా గెలిచి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికవుతూ వచ్చారు. 1987లో చైర్మన్‌ పదవికి జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా గెలిచి 1992 వరకు కొనసాగారు.

ఈటల రాజేందర్ పుట్టినరోజు

తెలంగాణ రాష్ట్ర రాజకీయ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ 1964లో కరీంనగర్ జిల్లా కమలాపురం మండలంలో జన్మించారు. విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లో పూర్తి చేశారు. 2004లో కమలాపూర్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2010 ఉపఎన్నికలు, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. 2021 జూన్ 4న బీజేపీలో చేరారు. ఉపఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

జస్టిస్ అద్దూరి సీతారాం రెడ్డి జన్మదినం

ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అద్దూరి సీతారాంరెడ్డి 1928 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో జన్మించారు. హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. లండన్ వెళ్లి న్యాయవిద్యను అభ్యసించారు. హైకోర్టు న్యాయమూర్తిగా, లోకాయుక్త జస్టిస్‌గా, ఎమ్మెల్సీగా పనిచేశారు. 1978 నుంచి 1990 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు.

శోభన్ బాబు మరణం

తన విలక్షణ నటనతో ఎంతో మంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న ప్రముఖ తెలుగు నటుడు శోభన్ బాబు 2008 చెన్నైలో మరణించారు. ఈయన 1937లో జనవరి 14న కృష్ణా జిల్లా చిన నందిగామలో జన్మించారు. శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు. తెలుగు సినిమాలతో విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1959లో దైవబలం అనే చిత్రంలో శోభన్ బాబు మొదటిసారిగా నటించారు. ఎన్నో చిత్రాల్లో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. నటనతో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.

న్యూటన్ మరణం

భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ 1726లో లండన్‌లోని కెన్సింగ్ టన్‌లో మరణించారు. ప్రకృతి సిద్ధమైన తత్వశాస్త్రం, అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందుకే ఆయనను ఆధునిక ప్రపంచ సైన్స్ పితామహుడిగా పిలుస్తారు. 1687లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం Philosophiae Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించారు.

మరికొన్ని విశేషాలు

  • ఏటా మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పిచ్చుకలూ, జనావాసాల్లో ఎక్కువగా కనిపించే ఇతర పక్షుల గురించీ, వాటి మనుగడకు వాటిల్లుతున్న ముప్పు గురించి జనాల్లో అవగాహన పెంచడం దీని ముఖ్య ఉద్దేశం.
  • నేపాల్ మాజీ ప్రధాని గిరిజా ప్రసాద్ కొయిరాలా 2010లో మరణించారు. 1991లో నేపాల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కొయిరాలా కృషిచేశారు.
  • లోక్ సభ మాజీ సభ్యుడు, టీడీపీ నేత గడ్డం గంగారెడ్డి 2017లో కన్నుమూశారు. ఈయన నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button