తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 21: చరిత్రలో ఈరోజు

ప్రపంచ అటవీ దినోత్సవం

ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. 2013లో తొలిసారి ఈ రోజును నిర్వహించాలని యునెస్కో నిర్ణయించింది. అడవుల ప్రాముఖ్యత, ప్రయోజనాలను భావితరాలకు తెలియజేయడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు.

అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం

అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. 1960 లో వర్ణవివక్ష పాస్ చట్టాలకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలోని షార్ప్‌విల్లేలో జరిగిన శాంతియుత ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పులలో 69 మంది మరణించగా, 180 మంది గాయపడ్డారు. దీంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అన్ని రకాల జాతి వివక్షలను తొలగించడానికి తన ప్రయత్నాలను రెట్టింపు చేయాలని.. 1966లో అంతర్జాతీయ సమాజానికి పిలుపునిస్తూ మార్చి 21 ని జాతి వివక్ష నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది.

ప్రపంచ రంగుల దినోత్సవం

అంతర్జాతీయ రంగుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకుంటారు. ప్రజల జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన విషయాలలో ఒకటైన రంగు ప్రాముఖ్యతపై అవగాహన కలిగించడానికి అంతర్జాతీయ రంగు సంఘం ఆధ్వర్యంలో ఈ దినోత్సవం జరుపుకుంటారు.

ప్రపంచ కవితా దినోత్సవం

ప్రపంచ కవితా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకుంటారు. 1999 లో యునెస్కో వారిచే నిర్ణయించబడిన ప్రపంచ కవితా దినోత్సవం రోజున కవిత్వాన్ని సమాజానికి మరింత చేరవ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం

ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తారు. డౌన్ సిండ్రోమ్ గురించి అవగాహన కల్పించేందుకు 2006లో ఈ దినోత్సవం ప్రారంభించబడింది. డౌన్ సిండ్రోమ్‌కు కారణమయ్యే 21వ క్రోమోజోమ్ ట్రిప్లికేషన్ (ట్రిసోమి) ప్రత్యేకతను సూచించడానికి మార్చి 21వ రోజు ఎంపిక చేయబడింది.

ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవం

ప్రపంచ తోలుబొమ్మలాట దినోత్సవాన్ని నేడు నిర్వహిస్తున్నారు. తోలుబొమ్మలాట కళల ప్రోత్సాహానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోలుబొమ్మలాట కళాకారులను ఏకం చేయడానికి ఈ దినోత్సరం జరుపుకుంటారు. 2003లో తొలిసారిగా ఈరోజును ప్రకటించారు.

జోసెఫ్ ఫోరియర్ పుట్టినరోజు

ప్రముఖ గణిత, భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ 1768 ఫ్రాన్స్ లో జన్మించారు. ఈయన పూర్తి పేరు జీన్ బాప్తిస్తే జోసెఫ్ ఫోరియర్. ఫోరియర్ ట్రాన్స్ ఫార్మ్, ఫోరియర్ సిరీస్ కనుగొన్న శాస్త్రవేత్తగా పేరుపొందారు.

అయర్టన్ సెన్నా పుట్టినరోజు

ఫార్ములా వన్ డ్రైవర్స్ మాజీ ఛాంపీయన్ అయర్టన్ సెన్నా 1960 బ్రెజిల్ లో సావోపాలో లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అయర్టన్ సెన్నా డా సిల్వా. 1988, 1990, 1991 లో ఫార్ములా వన్ డ్రైవర్స్ ఛాంపియన్ షిప్ టైటిల్స్ ను గెలుచుకున్నాడు. 1994 మే 1న ఇటలీలోని బోలోగ్నాలో ఫార్ములా వన్ రేసింగ్ లో ప్రమాదం కారణంగా మరణించాడు.

గ్యారీ ఓల్డ్ మన్ పుట్టినరోజు

ఆంగ్ల నటుడు, చిత్ర నిర్మాత గ్యారీ ఓల్డ్ మన్ 1958 లండన్ లోని న్యూ క్రాస్ లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు గ్యారీ లియోనార్డ్ ఓల్డ్ మాన్. 1979లో తొలసారిగా నటించడం ప్రారంభించాడు. అతని నటనతో ఎన్నో ప్రపంచస్థాయి పురస్కారాలను అందుకున్నాడు.

మేకా రంగయ్య అప్పారావు పుట్టినరోజు

ఎం. ఆర్. అప్పారావుగా ప్రసిద్ధి చెందిన మేకా రంగయ్య అప్పారావు 1915 కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. ఈయన 1952 నుంచి 1957, 62, 67, 72 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున నూజీవీడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పుట్టిన రోజు

ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ సాహెబ్ 1916 బీహార్ లో జన్మించారు. భారత దేశానికి చెందిన ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసుడు. సాంప్రదాయ వేడుకలు, ఉత్సవాలు జరిగినప్పుడు షెహనాయ్ వాద్యాన్ని ఉపయోగించడం రివాజే అయినా, దానిని కచేరి స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత మాత్రం బిస్మిల్లా ఖాన్ కే చెందుతుంది. 2001 లో భారత ప్రభుత్వం ఆయనను భారత రత్నతో సన్మానించింది.

నటరాజ రామకృష్ణ పుట్టినరోజు

కూచిపూడి నాట్య కళాకారుడు నటరాజ రామకృష్ణ 1933 ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జన్మించారు. వీరి తల్లి దమయంతి దేవి నల్గొండ జిల్లా, తండ్రి రామమోహరావు తూర్పు గోదావరి జిల్లాకు చెందినవారు. వృతిరీత్యా ఇండోనేషియాకు వలసవెళ్లారు. ఆంధ్రనాట్యము, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చారు.

మరిన్ని విశేషాలు

  • జపాన్ రాజధాని టోక్యోను 1857 లో వచ్చిన భయంకర భూకంపం అతలాకుతలం చేసింది. సుమారు లక్ష మంది ప్రజలు మృతిచెందినట్టు సమాచారం.
  • నమీబియాకు 1990లో దక్షిణాఫ్రికా నుంచి స్వాతంత్ర్యం లభించింది.
  • ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పప్పూరు రామాచార్యులు 1972లో మరణించారు. ఈయన అనంతపురం మున్సిపల్ ఛైర్మన్ గాను బాధ్యతలు నిర్వర్తించారు.
  • కొప్పరపు సోదర కవులుగా పేరు తెచ్చుకున్న కొప్పరపు వెంకటరమణ 1942 లో మరణించారు.
  • ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య పితామహుడు చినువ అచెబె 2013లో మరణించారు. ఆఫ్రికన్‌ ప్రజల జీవనచిత్రాన్ని, అత్యంత సహజంగా, శక్తివంతంగా తన రచనల ద్వారా ప్రపంచానికి చాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button