తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Budget Sessions: ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ ప్రసంగం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గవర్నర్‌ ప్రసంగించారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని.. ఇచ్చిన హామీలను ప్రభుత్వం పక్కగా అమలు చేసిందన్నారు. రైతులు, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారని.. అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించామన్నారు. పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని అసెంబ్లీలో గవర్నర్ తెలిపారు.

విద్యారంగంలో కీలక సంస్కరణలు:

స్కూళ్లలో మౌళిక సదుపాయాలు కల్పించామని.. నాడు- నేడు పథకంలో భాగంగా స్కూల్‌ మెయింటనెన్స్ ఫండ్ అందిస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్ధ పథకం ద్వారా 16 రకాల వంటకాలను మధ్యాహ్న భోజనంలో పిల్లలకు అందిస్తున్నామని.. అందుకోసం రూ. 4416 కోట్లను ఖర్చు చేశామని వెల్లడించారు. అలాగే జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు యూనిఫాం, బుక్స్‌ ఇచ్చేందుకు రూ.3367 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 294 ప్రభుత్వ బడులను అప్‌గ్రేడ్ చేశామన్నారు. 8,9 తరగతుల విద్యార్థులకు 9.5 లక్షల ట్యాబ్‌లు అందించామన్నారు. మరోవైపు జగనన్న వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికి 20 వేలు అందిస్తున్నామన్నారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు.

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం తీసుకొచ్చామన్నారు. రూ.1,208 కోట్లతో 1704.. 104, 108 వాహనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలోని 1.48 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నామన్నారు. 2019 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 36 లక్షల మందికి లబ్ధి చేకూరిందని, రూ.71 కోట్లతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు అందించామని గవర్నర్ తెలిపారు. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసిందన్నారు.

Also read: AP Government: పరిశ్రమలకు ప్రభుత్వం ఊతం.. ఫార్మాహబ్ గా ఏపీ

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి:

ఇక రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.13,500 అందిస్తున్నామని.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 53.53 లక్షల మందికి రైతు భరోసా అందించామని.. రూ.33, 300 కోట్లు రైతు భరోసా కింద అందించామని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు అదే ఏడాది పరిహారం అందిచామన్నారు. 22.85 లక్షల మంది రైతులకు రూ.1,977 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించామన్నారు. ఉద్యానపంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన తొలి రాష్ట్రం ఏపీ అని.. దేశంలో ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని వెల్లడించారు. ఈ క్రాపింగ్ బుకింగ్‌ ద్వారా పంట విస్తీర్ణంపై డిజిటల్ రికార్డింగ్.. పంటల సేకరణకు రూ.7,751 కోట్లు కేటాయించాం. దేశంలో పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 15 శాతం ఉంది. సూక్ష్మ సేద్యంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని వివరించారు.

ఆక్వా ఉత్పత్తిలో ఏపీ ఫస్ట్:

ఇక అక్వారంగంలో ఏపీ దూసుకుపోతుందని గవర్నర్ వెల్లడించారు. చేపల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. ఆక్వా హబ్‌ ఆఫ్‌ ఇండియాగా రాష్ట్రం అవతరించిందని.. మత్స్యకారుల కోసం వేట నిషేధ కాలంలో ఇచ్చే పరిహారం 10 వేలకు పెంచామని.. 2.4 లక్షల మంది మత్స్యకార లబ్ధిదారులకు రూ.540 కోట్లు జమ చేశామని వెల్లడించారు. అలాగే మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను 10 లక్షలకు పెంచామని” గవర్నర్ తమ ప్రసంగంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button