తెలుగు
te తెలుగు en English
జాతీయం

Politics: ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు… ఆసక్తికరంగా మారిన రాజకీయాలు

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం ఢిల్లీకి చేరుకుంది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకే సమయంలో హస్తినలో పర్యటిస్తున్నారు. నేటి ఉదయం చంద్రబాబు, ప్రధాని మోదీతో భేటీ కాగా మధ్యాహ్నం రేవంత్ పీఎంను కలవబోతున్నారు. అయితే ఈ నెల 6వ తేదీన రేవంత్ రెడ్డి, చంద్రబాబు హైదరాబాద్ వేదికగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీకి సరిగ్గా రెండురోజుల ముందు ఇరువురు సీఎంలు ప్రధానితో వేర్వేరుగా సమావేశం కాబోతుండటం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఈ సందర్భంగా విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను పీఎంకు వివరించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని ప్రధానిని కోరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా ముఖ్యమంత్రులు ప్రధానితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఓ వైపు చంద్రబాబు, రేవంత్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ గురుశిష్యుల బంధాన్ని తెరపైకి తీసుకువస్తున్న వేళ తెలంగాణ సీఎం అనూహ్యంగా బాబు టూర్ సమయంలోనే తానూ హస్తినలో పర్యటించడంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. 45 నిమిషాలకు పైగా సమావేశం సాగింది. పలు కీలక అంశాలపై మోదీతో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తుంది. ఏపీ ఆర్థిక పరిస్థితులు, పోలవరం, రాజధాని అంశాలపై మోదీకి సీఎం వివరించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, విభజన హామీలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధుల కేటాయింపుపై విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

నరేంద్ర మోదీతో భేటీకి ముందు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో గతవారమే పలువురు కేంద్ర మంత్రులను సీఎం, డిప్యూటీ సీఎం కలిసి తెలంగాణ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. నిధులు కేటాయించాలని కోరారు. ఈ టూర్‌లో భాగంగా మరికొంతమంది కేంద్ర మంత్రులతోనూ ఇరువురు భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button