తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: అధికారం దిశగా కాంగ్రెస్ ఎదగడానికి ప్రధాన కారణాలు ఇవే..

తెలంగాణలో అధికారం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఎన్నికల ప్రకటన రాకముందు నుంచే హస్తం తుఫాన్ మొదలైంది. ఇక ఎన్నికల సమయంలో మరింత పుంజుకుని పోలింగ్ నాటికి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి చేరింది. ఎగ్జిట్ పోల్స్ లోనూ ఇదే ఫలితాలు పునరావృతమయ్యాయి. ఇక ఒక్కరోజు ఆగితే కాంగ్రెస్ గెలుపు లాంఛనం కానుంది. ఈనెల 9వ తేదీన అధికారం సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ఇంతలా పుంజుకోవడానికి కారణాలు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఇచ్చిన.. తెచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను ప్రజలు నేడు ఇంతలా ఆదరించడం వెనుక చాలా కారణాలు దాగి ఉన్నాయి.

Also Read: సర్వేలన్నీ కాంగ్రెస్ కే పట్టం.. 9న సర్వం సిద్ధం

పార్టీ నాయకుల చొరవ
2014లో 21 స్థానాలు, 2018లో 19 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా 65 నుంచి 70 స్థానాలకు పైగా ఆ పార్టీ సొంతం చేసుకుంటుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడానికి వెనుక ప్రధాన కారణం బీఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత.. సీఎం కేసీఆర్ అవినీతి. దీనికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కనిపించింది. దీనికితోడు ఆకర్షణీయ మ్యానిఫెస్టో, హామీలు వంటివి ఆ పార్టీని పుంజుకోవడానికి దోహదం చేశాయి. ఇక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దూకుడు స్వభావం పార్టీకి కలిసొచ్చింది. నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. ఆయన చేపట్టిన పాదయాత్ర పార్టీకి జవసత్వాలు ఇచ్చింది.

ఇక ఆయనతోపాటు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి లాంటివారు తమ తమ ప్రాంతాల్లో తరచూ కార్యక్రమాలు చేపట్టడం.. ప్రజల్లో నిరంతరం తిరుగుతుండడం పార్టీ పుంజుకోవడానికి కారణంగా మారింది. గతంలో విబేధాలతో గ్రూపు రాజకీయాలు కొనసాగిన పార్టీలో ప్రస్తుతం ఐక్యత వచ్చింది. అంతర్గత సమస్యలు పరిష్కరించుకుని ప్రజల ముందుకు పార్టీ నాయకులు కలిసికట్టుగా వెళ్లడం సానుకూల ప్రభావం చూపింది.

Also Read పోల్ స్ట్రాటేజీ గ్రూప్ ఎగ్జిట్ ఫలితాలు ఇవే.. మిగతావి

అధిష్టానం సమయం
ఇక అధిష్టానం తెలంగాణపై పూర్తి దృష్టి కేంద్రీకరించడం పార్టీకి ఫుల్ జోష్ ఇచ్చింది. పార్టీ నాయకులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. తెలంగాణ కోసం పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితర పార్టీ పెద్దలు వీలైనంత సమయం ఇచ్చారు. తెలంగాణ పర్యటనకు ఎప్పుడంటే అప్పుడు సమయం ఇచ్చి తరచూ రాష్ట్రంలో పర్యటించారు. అంతేకాకుండా పర్యటనలో ప్రొటోకాల్ ను పట్టించుకోకుండా నేరుగా ప్రజల్లో కలవడం సానుకూల ప్రభావం చూపింది.

జోష్ నింపిన జోడోయాత్ర
మరి ముఖ్యంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి వచ్చింది. రాహుల్ పాదయాత్ర తెలంగాణలో సుదీర్ఘంగా కొనసాగింది. మక్తల్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రలోకి సాధ్యమైనంత ఎక్కువ నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరిగింది.

ఇలా వివిధ కారణాలు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి దారి తీశాయి. మరి తెలంగాణలో అధికారం చేపడుతుందా లేదా అనేది రేపు మధ్యాహ్నం వరకు వేచి చూస్తే చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button