తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana Government: తెలంగాణలో త్వరలో కులగణన.. వెల్లడించిన సీఎం రేవంత్

త్వరలోనే తెలంగాణలో కుల గణన చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం.. తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కుల గణనకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అయితే దేశంలో పలు రాష్ట్రాల్లో కులగణన ప్రక్రియ జరుగుతోంది. అలాగే పొరుగున ఉన్న ఏపీలో కూడా కులగణన ప్రక్రియకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కులగణన చేపడతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా మాటిచ్చారు.

Also read: CM Jagan: ‘రానున్నది కౌరవులతో యుద్ధం.. తాను అభిమన్యుడిని కాదు అర్జునుడిని’

శనివారం సచివాలయంలో బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠశాలలకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. వీటికి సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని.. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి సరిపడే స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని అన్నారు. మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ స్కీమ్ ను మరింత సమర్ధంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని.. వాటిలో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ స్కీమ్ లో మొదటి ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని.. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. దీంతో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ కూడా మరింత మెరుగ్గా చేసే వీలుంటుందని సీఎం పేర్కొన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవటం ద్వారా వారిలో ప్రతిభా పాఠవాలు పెరుగుతాయని, పోటీతత్వం పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. వెంటనే అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని.. ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల, కంపెనీల సహకారం తీసుకోవాలని సూచించారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) ఫండ్స్ ను సమీకరించాలని, ముందుకు వచ్చే దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button