తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Elections: హైదరాబాద్‌కు అగ్ర నేతలు.. పెరగనున్న పొలిటికల్ హీట్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచనున్నారు. ఈ మేరకు అన్ని పార్టీల అగ్రనేతలు హైదరాబాద్‌ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ అగ్ర నాయకులు కేసీఆర్, హరీశ్ రావు హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు కేటీఆర్ కూడా ర్యాలీలు, వీధి సభల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా నియోజకవర్గాల్లో సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు.

కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలు

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ నెల 21 నుంచి నాలుగైదు సభల్లో పాల్గొననున్నారు. అయితే ఇందులో రెండు సమావేశాలకు ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. కాగా, ఇవాళ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే విడుదల చేస్తుండగా.. బీజేపీ మేనిఫెస్టోను కేంద్రమంత్రి అమిత్ షా రేపు విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా హైదరాబాద్‌లో ప్రధాని మోదీతో మరో బహిరంగ సభ ఉంటుందని సమాచారం.

25న కేసీఆర్ సభ

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో ప్రతిరోజూ జన ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. దీంతో సభా ఏర్పాట్లు వేగవంతం కానున్నాయి.

ఐదు రోజులు రాహుల్ ప్రచారం…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఈనెల 21 తర్వాత ఐదు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర ఏఐసీసీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రచారం ఊపందుకోనుంది. మరోవైపు ఇవాళ రాహుల్‌గాంధీ తెలంగాణకి రానున్నారు. ఈ మేరకు పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో రాహుల్ సభలు నిర్వహించనున్నారు.

నేడు అమిత్ షా రాక..

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఇవాళ రాత్రి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో బస చేయనున్నారు. శనివారం 10.30 గంటలకు సోమాజిగూడలోని క్షత్రియ హోటల్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం మేనిఫెస్టోను ప్రజలకు అమిత్ షా వివరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button