తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Siddipet: కేసీఆర్ ను ఓడించిన ఒకే ఒక్కడు.. ఎవరో తెలుసా?

అపర చాణక్యుడు.. రాజకీయ దురంధరుడు.. అనే బిరుదులు పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైంది. తొలి ఎన్నికల్లోనే చేదు అనుభవం ఎదుర్కొన్న కేసీఆర్ ఆ తర్వాత ఓటమనేదే ఎరుగడు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి బంపర్ మెజార్టీలతో గెలిచిన చరిత్ర కేసీఆర్ (KCR) ది. ఉప ఎన్నికలకు వెళ్లినా కూడా ప్రజలు ఆదరించారు. ప్రస్తుతం ఎనిమిదోసారి అసెంబ్లీ బరిలో కేసీఆర్ దిగుతున్నాడు. ఈ సందర్భంగా కేసీఆర్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకోవాలి. ఇంతటి రాజకీయ చతురత కలిగిన కేసీఆర్ ను ఓడించిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే అనంతుల మదన్ మోహన్ (Ananthula Madan Mohan). ఇప్పటి తరానికి ఆయన తెలియకపోవచ్చు కానీ 90, 2000ల కాలంలో మదన్ మోహన్ అందరికీ సుపరిచితుడే. మరి ఆయన కేసీఆర్ ను ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా ఓడించారో తెలుసుకోండి.

చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన మహిళ

అది 1983 ఎన్నికల కాలం. మెదక్ జిల్లాలోని సిద్దిపేట (Siddipet) నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కేసీఆర్ పోటీలో నిల్చున్నాడు. బీజేపీ తరఫున నిమ్మ నర్సింహరెడ్డి బరిలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మదన్ మోహన్ పోటీలో ఉన్నాడు. తొలిసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ పడగా మదన్ మోహన్ చేతిలో ఓడిపోయాడు. కేసీఆర్ కు 27,889 ఓట్లు రాగా.. మదన్ మోహన్ కు 28,766 ఓట్లు వచ్చాయి. కేవలం 887 ఓట్ల తేడాతో కేసీఆర్ ను మదన్ మోహన్ ఓడించారు.

ఆ ఓటమి నుంచి కేసీఆర్ చాలా పాఠాలు నేర్చుకున్నాడు. అనంతరం 1989 ఎన్నికల్లో సిద్దిపేట నుంచే కేసీఆర్, మదన్ మోహన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మదన్ మోహన్ ను కేసీఆర్ ఓడించారు. అప్పుడు మొదలైన కేసీఆర్ విజయయాత్ర నేటి వరకు కొనసాగుతోంది. 1994లోనూ అతడిని కేసీఆర్ ఓడించారు. ఆ తర్వాత వరుసగా సిద్దిపేట నుంచి గెలుస్తున్న కేసీఆర్ తదనంతరం అల్లుడు హరీశ్ కు సిద్దిపేట ఇచ్చి గజ్వేల్ కు మారారు.

Also Read  గెలిపిస్తే మంత్రినవుతా.. ములుగువాసులతో సీతక్క

మదన్ మోహన్ ను కేసీఆర్ గురువుగా భావిస్తాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి పని చేశారు. మదన్ మోహన్ వద్ద కేసీఆర్ ఎన్నో నేర్చుకున్నాడు. అనంతరం గురువును మించిన శిష్యుడిగా ఎదిగాడు. అలాంటి మనిషి 2004లో మరణిస్తే కేసీఆర్ చాలా బాధపడ్డాడు. కేసీఆర్ ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికల బరిలో నిలబడగా 13 సార్లు గెలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేసీఆర్ కు 15వ ఎన్నిక. మరి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తాడా లేదా అనేది డిసెంబర్ 3వ తేదీన తెలియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button