తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఫిబ్రవరి 19: చరిత్రలో ఈరోజు

ఛత్రపతి శివాజీ జననం

ఛత్రపతి శివాజీగా పేరుగాంచిన శివాజీ రాజే భోంస్లే 1627లో పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించారు. పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొదటిసారి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. 1674 సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్‌గా నిర్వహిస్తున్నారు.

నికోలస్ కోపర్నికస్ జననం

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత నికోలస్ కోపర్నికస్ 1473 పోలాండ్ లోని ధార్న్ అనే పట్టణంలో జన్మించాడు. ఈయన సూర్యకేంద్ర సిధ్ధాంతాన్ని శాస్త్రీయంగా నిరూపించాడు. ఇటలీలో బొలోగ్నా విశ్వవిద్యాలయంలో న్యాయ, గణిత, ఖగోళ శాస్త్రం అభ్యసించాడు. సూర్యకేంద్ర సిద్ధాంతాల నమూనాలను, సిద్ధాంతాలను, ఇతని కంటే ఎన్నో వందల ఏండ్లకు మునుపే ఆర్యభట్టు, ఒమర్ ఖయ్యాంలు ప్రతిపాదించారు. కానీ, కోపర్నికస్ రచనల్లో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని, సైద్ధాంతికంగా నిరూపించడంతో ప్రాధాన్యం సంతరించుకున్నాడు.

కె. విశ్వానాథ్ జననం

కళాతపస్వి, కె. విశ్వనాథ్ 1930లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామంలో జన్మించారు. ఈయన తెలుగులో ప్రముఖ సినిమా దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి. అక్కినేని నటించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. దర్శకుడిగా జోరు తగ్గాక సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. సినిమారంగంలో చేసిన కృషికి గాను 2016లో ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఆ తర్వాత 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నాడు. అదే ఏడాది పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నాడు.

గోపాలకృష్ణ గోఖలే మరణం

భారత స్వాతంత్య్ర సమర యోధుడు, సామాజిక సేవకుడు గోపాలకృష్ణ గోఖలే 1915లో మరణించారు. భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అయిన ఈయన 1866 మే 9న ప్రస్తుత మహారాష్ట్రలోని కొతాలక్‌లో జన్మించారు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రముఖపాత్ర వహించాడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటుచేశాడు. ఈయన మహమ్మద్ అలీ జిన్నా, మహాత్మా గాంధీకి రాజకీయ గురువు.

నిర్మలమ్మ మరణం

సినీనటి నిర్మలమ్మ 2009 ఫిబ్రవరి 19న మరణించారు. 1920 జూలై 18న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు

మరికొన్ని విశేషాలు

  • గుజరాత్ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి బల్వంతరాయ్ మెహతా పుట్టినరోజు నేడు. స్వాతంత్ర సమరయోధుడిగా, పంచాయతీరాజ్ వ్యవస్థ మార్గదర్శకుడిగా పేరుగాంచారు.
  • ప్రముఖ తెలుగు సినీ హస్య నటుడు గుండు హనుమంతరావు నేడు మరణించారు. దాదాపు 400 సినిమాలు, పలు సీరియల్స్ లో నటించారు.
  • కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన జి. సాయన్న నేడు మరణించారు. టీడీపీ, బీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు.
  • బోయింగ్ 757 అనే విమానం 1982లో మొదటిసారిగా ఆకాశానికి ఎగిరింది.
  • 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో 2008లో పదవికి రాజీనామా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button