తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

మూవీ రివ్యూ: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

Pakka Telugu Rating : 2.5/5
Cast : విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి, నాజర్, గగన్ విహారి, హైపర్ ఆది, తదితరులు
Director : కృష్ణ చైతన్య
Music Director : యువన్ శంకర్ రాజా
Release Date : 31/05/2024

విభిన్న కథల్ని ఎంచుకుంటూ, నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. గామి వంటి వైవిధ్య భరితమైన సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల మధ్య ఇవాళ విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంతవరకు మెప్పించిందో పూర్తి రివ్యూ చూసేద్దాం!

కథ

ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్‌ అలియాస్‌ రత్న (విశ్వక్‌ సేన్‌) ఊరిలో పనీ పాటా లేకుండా దొంగతనాలు చేస్తూ తిరుగుతూ ఉంటాడు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు (గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ (నాజర్‌) కూతురు బుజ్జి (నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరు రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్‌ ఎమ్మెల్యే ఎలా అయ్యాడు? ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్‌ ఏం చేశాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం-విశ్లేషణ

రాయలసీమ నేపథ్యంలో ఒక ఊళ్లో జరిగే రాజకీయాలు, కక్షసాధింపులు వంటి కథాంశంతో చాలానే సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం కూడా అచ్చం అలాంటి కథే. కాకపోతే ఈ మూవీలో హీరో రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, గోదావరి ప్రాంతానికి చెందిన ఒక బస్తీ కుర్రాడు. ఇది పక్కా మాస్ కథ. విశ్వక్ సేన్ లాంటి హీరోను తీసుకున్నపుడే ఈ సినిమాకు సగం న్యాయం జరిగిందని చెప్పాలి. రత్న పాత్రలో విశ్వక్ ఒదిగిపోయాడు. సినిమా మొదలైన కాసేపటికే ఆ కారెక్టర్‌ అందరికీ నచ్చుతుంది. పూర్తిగా హీరో పాత్రతోనే కథను ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు కృష్ణ చైతన్య. ఇంటర్వెల్‌కు ముందే వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త నెమ్మదించింది. రాజకీయాల్లో ఉండే లొసుగులు వాడుకుంటూ హీరో ఎలా పైకి ఎదిగాడు.. ఆ తర్వాత ఎలా దిగజారాడు అనేది దర్శకుడు చక్కగా చూపించాడు. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. కానీ ఇందులోనూ లోపాలు చాలానే ఉన్నాయి. సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. మధ్య మధ్యలో కొన్ని సీన్లు బోర్ కొడతాయి.

నటీనటులు

రత్న పాత్రలో విశ్వక్ సేన్ అదరగొట్టారు. ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశారని కూడా చెప్పొచ్చు. స్వతహాగానే మాస్ క్యారెక్టర్స్ ని ఇష్టపడే విశ్వక్‌కి ఇది సరైన ఎంపిక. గోదావరి యాసలో మాట్లాడేందుకు విశ్వక్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. అయితే అక్కడక్కడ మాత్రం తెలంగాణ యాస బయటకు వచ్చింది. బుజ్జి పాత్రలో నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. వేశ్య రత్నమాల పాత్రకు అంజలి న్యాయం చేసింది. విలన్‌గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్‌, సాయి కుమార్‌ హైపర్‌ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం

ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం ప్లస్ పాయింట్. పాటలు చాలా బాగున్నాయి. ‘సుట్టంలా సూసి’ అంటూ సాగే పాట సినిమా రిలీజ్‌కి సూపర్ హిట్‌గా నిలిచింది. కెమెరా మెన్ అనిత్ గోదావరి అందాలను అద్భతంగా చూపించారు. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ చాలా బాగుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. చిత్ర నిర్మాణంలో ఎక్కడా వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు.

ప్లస్ పాయింట్స్

  • విశ్వక్ నటన
  • యాక్షన్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్‌ నెమ్మదించడం
  • బోర్ కొట్టే కొన్ని సన్నివేశాలు

పంచ్ లైన్: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మాస్ ఆడియన్స్‌కి జాతరే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button