తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ
Trending

మూవీ రివ్యూ: హరోం హర

Pakka Telugu Rating : 2.5/5
Cast : సుధీర్ బాబు, మాళవిక శర్మ , సునీల్, జయప్రకాష్ తదితరులు
Director : జ్ఞాన సాగర్
Music Director : చైతన్ భరద్వాజ్
Release Date : 14/06/2024

జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన చిత్రం ‘హరోం హర’. సుమంత్ నాయుడు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించగా, సునీల్, జయప్రకాష్ కీలక పాత్రలు పోషించారు. మారుతి డైరెక్షన్ లో వచ్చిన ‘ప్రేమ కథా చిత్రం’ తర్వాత సుధీర్ బాబుకు మళ్లీ ఆ స్థాయి హిట్ పడలేదు. దీంతో సరైన హిట్ కోసం ఆయన కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ మూవీతోనైనా సుధీర్ బాబు హిట్ కొట్టాడా? చూద్దాం.

కథ

అది 80వ దశకంలోని కుప్పం. తిమ్మారెడ్డి ఆ ప్రాంతన్ని తన గుప్పిట్లో పెట్టుకొని అరాచకం చేస్తుంటాడు. కనిపించిన భూమిని కబ్జా చేస్తాడు. అడ్డుతిరిగిన వారిని అంతం చేస్తుంటాడు. తిమ్మారెడ్డికి భయపడి అక్కడి ప్రజలు చాలా మంది వేరే ప్రాంతానికి వెళ్లి తల దాచుకుంటారు. ఇలాంటి సమయంలో కుప్పంలోని కాలేజీకి ల్యాబ్ అసిస్టెంట్‌గా వస్తాడు సుబ్రమణ్యం (సుధీర్ బాబు). ఓ సందర్భంలో తిమ్మారెడ్డి మనుషులతో గొడవపడి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటాడు. మ‌రో వైపు తండ్రి చేసిన అప్పులు తీర్చే బాధ్యత సుబ్రమణ్యం మీద పడుతుంది. ఇలాంటి సమయంలో స్వతహాగా గన్ తయారు చేయాలనే ఆలోచన చేస్తాడు సుబ్రమణ్యం. తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల మాఫియాలో సుబ్రమణ్యం ఏ స్థాయికి ఎదిగాడు? తనకు ఎలాంటి శత్రువులు పుట్టుకొచ్చారు? ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అన్నవి తెరపైనే చూడాలి.

కథనం-విశ్లేషణ

పొట్ట చేత పట్టుకుని వేరే ఊరికి వచ్చిన ఓ కుర్రాడు అప్పటివరకు ఆ ఊరిని శాసిస్తున్న దుర్మార్గుల ముఠా బారి నుంచి ఊరిని రక్షించి ఆ ఊరు మొత్తానికి దేవుడైన కథాంశం ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూశాం. ఈ సినిమా కూడా అదే కోవకు చెందినది. కుప్పం అనే ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం ఆ కుప్పం మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న ఇద్దరు అన్నదమ్ముల ముఠాను ఎలా ఆట కట్టించాడన్నదే ఈ కథ. అయితే కథలో కొత్తదనం లేకపోయినా దర్శకుడు దానికి అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ జోడించాడు. నిజానికి ఈ సినిమా మొదలైన చాలాసేపటి వరకు అసలైన కథలోకి తీసుకువెళ్లలేదు దర్శకుడు. అయితే కథలోకి తీసుకువెళ్లే సమయానికి ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ వచ్చేస్తుంది. ఒక్కసారిగా ఆ ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ అబ్బురపరుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. అయితే సినిమా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే విషయంలో మాత్రం ఎందుకో పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ ఊహించే విధంగా ఉండటం, హీరోకి, విలన్‌కి బలమైన సంఘర్షణ లేకపోవడం, హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం లేకపోవడం మైనస్. అయితే, సుధీర్ బాబు యాక్షన్, ఫిజిక్ సినిమాకి ప్లస్ అయింది.

నటీనటులు & సాంకేతిక వర్గం

యాక్షన్ సీన్స్‌లో సుధీర్ బాబు అదరగొట్టాడు. ఈ పాత్ర కోసం అతను చాలా కష్టపడ్డట్లు తెర మీద కనిపిస్తుంది. మనది కాని యాస మాట్లాడుతున్నప్పుడు కొంత ఇబ్బంది అనిపిస్తుంది కానీ సుధీర్ బాబు ఎంత హోంవర్క్ చేశాడో కానీ కుప్పం యాసను భలే పట్టేశాడు. ఆయనకు జోడీగా నటించిన మాళవిక శర్మ కూడా ఏమాత్రం తగ్గకుండా నటించింది. జయప్రకాశ్ సహా రవి కాలే, అర్జున్ గౌడ వంటి వాళ్లు తమదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సునీల్‌కి పుష్ప తర్వాత మళ్లీ మంచి పాత్ర దక్కింది. సినిమాటోగ్రఫీతో పాటు కలర్ డీఐ చేసిన వారికి స్పెషల్ అప్రిసియేషన్ దక్కాల్సిందే. అలాగే 1980ల నాటి కుప్పాన్ని మళ్లీ రీ క్రియేట్ చేసిన ఆర్ట్ టీం కష్టం కూడా ప్రతి ఫ్రేమ్‌లో కనబడింది. కుప్పం యాస విషయంలో తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి ప్లస్ పాయింట్లలో ఒకటిగా నిలుస్తాయి. సినిమా మొత్తానికి సినిమాటోగ్రఫీతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లస్ అయింది.

ప్లస్ పాయింట్స్

  • యాక్షన్ సన్నివేశాలు
  • సుధీర్ బాబు నటన

మైనస్ పాయింట్స్

  • రొటీన్ కథ
  • కొన్నిచోట్ల సన్నివేశాల సాగదీత

పంచ్ లైన్: ‘హరోం హర’ యాక్షన్ సన్నివేశాల ప్యాక్ అప్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button