తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana Elections: కేసీఆర్ ఓడాలి… రేవంత్ గెలవాలి: కోనాపూర్ వాసులు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నిన్న నామినేషన్లకు చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు నామినేషన్లను వేశారు. ఇక రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్యనే పోటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తామని చెబుతున్న నీటి మీది రాతలలాగే కనిపిస్తున్నాయి. కార్యకర్తలు, నాయకులలే ఈ ఊపు, ఉత్సాహం గానీ కనిపించడం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ స్టార్ క్యాంపెయినర్ గా సుడిగాలి పర్యటనలు చేస్తుంటే, రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారాన్ని సాగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో హడావిడి చేస్తున్నారు. బీజేపీ తరుపున లోకల్ లీడర్ల హడావిడి అంతంత మాత్రంగానే ఉన్న ఇప్పటికే ఢిల్లీ నుంచి అగ్రనేతలు పలు దఫాలుగా వచ్చి పర్యటించి సభలు, సమావేశాలలో పాల్గొన్నారు.

కేసీఆర్ తల్లి గ్రామస్థులు రేవంత్ కు విరాళం

కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచి జోష్ తో ఉన్నారు. ఇక తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నామినేషన్ కోసం కేసీఆర్ తల్లి స్వగ్రామమైన కోనాపూర్ వాసులు విరాళంగా నామినేషన్ డబ్బులను అందించారు. కామారెడ్డికి చేరుకున్న రేవంత్ ను కలిసిన గ్రామస్తులు ఆ మొత్తాన్ని అందించారు. కేసీఆర్ రెండు సార్లు సీఎం గా ఉన్న ఆయన పూర్వీకుల గ్రామమైన కొనాపూర్ కు చేసిందేమీ లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ను ఈసారి గద్దెదించాలని కొనాపూర్ వాసులు సూచించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ గెలవాలని వారు కోరుకున్నారు.

కేసీఆర్ ను గద్దెదించడం ఖాయం

ఎన్నికల సమయంలో మాత్రమే కేసీఆర్ కు తమ గ్రామం గుర్తొచ్చిందా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా తమ గ్రామం నిర్లక్ష్యానికి గురైందని, కానీ ఇప్పుడు ఓట్ల కోసమే వస్తున్నారని పార్టీ నాయకులపై మండిపడ్డారు. ఎట్టి పరిస్థితిలోనూ కొనాపూర్ గ్రామస్తులు కేసీఆర్ కు ఓటు వేసేది లేదని వారు తేల్చి చెప్పారు. కేవలం ఆయన పాలన పైన విరక్తితో, గద్దె దించడం కోసమే రేవంత్ రెడ్డికి గ్రామస్తులంతా కలిసి నామినేషన్ డబ్బులు అందజేశామని వారు వాపోయారు. ఇక రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ను తప్పనిసరిగా గద్దె దించుతామని అప్పటివరకు అలుపెరుగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఓట్ల కోసం ప్రేమ ఒలకబోత… పని మాత్రం శూన్యం

కామారెడ్డి, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్‌ దాఖలు చేసిన రోజున కామారెడ్డితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్‌ ప్రజలకు వివరించారు. బీబీపేట మండలంలోని పోసానిపల్లి నేటి కోనాపూర్‌ తన తల్లి స్వగ్రామం అంటూ వివరించారు. తన చిన్నతనంలో ఈ ప్రాంతంలో తన తల్లి, కుటుంబీకులతో కలిసి తిరిగిన ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆరుగొండలో తన మేనమామలు ఉంటారని కేసీఆర్‌ చెప్పారు. అయితే ఓట్ల కోసం ఆయన చెప్పే మాయ మాటలను నమ్మడానికి గ్రామస్థులేవరు సిద్దంగా లేరని తేల్చిచెప్పారు. ఇన్ని రోజులు గుర్తుకు రాని తల్లి గ్రామం ఇప్పుడు ఎలక్షన్స్ లో ఓట్ల కోసం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఇది కేసీఆర్ కు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button