తెలుగు
te తెలుగు en English
జాతీయం

CM Mohan Yadav: మధ్యప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి అమ్మకాలు బంద్

మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కార్ బుధవారం కొలువుదీరింది. సీఎంగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్రంలో మాంసం, గుడ్ల విక్రయాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు దుకాణాలను నడపడానికి భారత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, మధ్యప్రదేశ్‌లో వీటిని అనుసరించేందుకు కఠిన ఆదేశాలు జారీ చేశామని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, చేపల విక్రయాల నిషేధంపై డిసెంబర్ 15 నుంచి 31 వరకు ప్రచారం ప్రారంభిస్తామన్నారు.

Also read: World’s Biggest Office: ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్.. డిసెంబర్ 17న ప్రధాని ప్రారంభం

ప్రతి జిల్లాలో యువత కోసం ఒక ఎక్స్‌లెన్స్ కళాశాలను నిర్మిస్తామని, దీనిని ప్రధాన మంత్రి ఎక్స్‌లెన్స్ కళాశాలగా పిలుస్తామన్నారు. ఇందుకోసం 52 కాలేజీలు ఎంపిక చేశామని తెలిపారు. డిగ్రీ మార్క్స్‌షీట్‌ల కోసం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వీటికి పరిష్కారంగా కాలేజీలు, యూనివర్శిటీలలో డిజీ లాకర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

తరచూ నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హోంశాఖతో మాట్లాడుతున్నామన్నారు. ఎవరైనా మతపరమైన ప్రదేశంలో పరిమితులను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో మతపరమైన, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించారు. లౌడ్ స్పీకర్ల వలన తీవ్రమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య లౌడ్ స్పీకర్లు వినియోగించవద్దని చెప్పింది. ప్రతి జిల్లాలో ఒక ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని మోహన్ యాదవ్ ప్రభుత్వం నిర్ణయించింది.

జనవరి 22న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జరిగే నూతన రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోనూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అయోధ్యకు వెళ్లే వారికి రామమందిర మార్గంలో స్వాగత సన్నాహాలు చేస్తున్నామన్నారు. 2024 జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలోని మొత్తం 55 జిల్లాలలో సైబర్ తహసీల్ ఏర్పాటు చేయనున్నామని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button