తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Kishan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్.. సీబీఐ విచారణ చేయనున్నారా?

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి తప్పుబట్టారు. హైదరాబాద్ పార్టీ ఆఫీసులో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరి పాలు చేశారని.. పిల్లర్లు కుంగి.. దేనికీ పనికి రాకుండా పోయిందని.. మేడిగడ్డను సందర్శించిన కేంద్ర ఇంజినీర్ల బృందానికి కూడా సరైన వివరాలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇంత జరిగినా.. కాళేశ్వరం ప్రాజెక్టు నాశనం అయినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ కోరటం లేదని ప్రశ్నించారు.

Also read: Numaish: నుమాయిష్ ప్రారంభం.. ఎగ్జిబిషన్ వివరాలు తెలుసుకోండి

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ.. కేంద్రానికి లేఖ రాస్తే.. కేవలం 48 గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశిస్తుందని.. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో.. కేసీఆర్ ను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని.. అందుకే కేవలం న్యాయ విచారణకు మాత్రమే ఆదేశించినట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ముందు.. ఎలాంటి భూ పరీక్షలు చేయలేదని.. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గోప్యంగా ఉంచుతుందని.. ఊచలు లెక్కపెట్టాల్సిన కేసీఆర్ ను కాపాడుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతిపై కేసీఆర్ ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించలేదని.. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా జీవో తెచ్చారని.. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సీబీఐ విచారణకు అంగీకరిస్తుందా లేదా.. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సీబీఐ విచారణ కోరుతూ లేఖ రాటం లేదని ప్రశ్నించారాయన. బీఆర్ఎస్ పార్టీపై సానుభూతితో ఉన్నారా అని ప్రశ్నిస్తూనే.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తారా లేదా అని నిలదీశారు. ఈ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సయోధ్య కుదిరిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తూనే.. కేసీఆర్ పీడ విరగడ కావాలని.. కేసీఆర్ పోవాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్ కు మేలు చేసేలా కాంగ్రెస్ అడుగులు వేస్తోందంటూ విమర్శలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button