తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Visakha Metro: విశాఖ వాసులకు సీఎం గుడ్ న్యూస్.. సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్ ఏంటీ?

దసరా తర్వాత విశాఖపట్నం కేంద్రంగా జగన్ సర్కారు పరిపాలన సాగించడానికి అడుగులేస్తున్న వేళ.. నగర అభివృద్ధిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం కోసం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విశాఖ నగరంలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులేస్తోంది. తొలి విడత మెట్రో రైలు ప్రాజెక్టు కోసం జగన్ సర్కారు సంకాంత్రి కానుకగా.. జనవరి 15న శంకుస్థాపన చేయనున్నారు.

మొదటి విడతలో 76.90 కి.మీ. మేర లైట్‌ మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. మూడు కారిడార్లు, 42 స్టేషన్లతో చేపట్టనున్న తొలి విడత మెట్రో నిర్మాణం కోసం దాదాపు రూ.10 వేల కోట్లు అవసరమని అంచనా. స్టీల్‌ప్లాంట్‌ గేట్‌ నుంచి కొమ్మాది జంక్షన్‌ వరకు ఉండే కారిడార్-1 పొడవు 34.40 కి.మీ. ఉంటుంది. గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్‌ వరకు 5.07 కి.మీ. పొడవైన రెండో కారిడార్ ఉంటుంది. తాటిచెట్లపాలెం నుంచి చిన వాల్తేరు వరకు 6.75 కి.మీ. పొడవున మూడో కారిడార్ ఉంటుంది.

రెండో విడతలో నిర్మించే కారిడార్-4ను కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు 30.67 కి.మీ. పొడవున నిర్మించనున్నారు. మొత్తం కలిపి 54 మెట్రో స్టేషన్లు, రెండు డిపోలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రెండు దశలు కలిపితే రూ.14,309 కోట్లు అవసరమని అధికారులు తెలుపుతున్నారు. దీంతో నిధుల సమీకరణ దిశగా చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

జనవరిలో శంకుస్థాపన చేసినప్పటికీ.. అంతా సవ్యంగా సాగితే.. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే విశాఖ మెట్రో నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో తరహాలో కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంలో విశాఖ లైట్ మెట్రోను నిర్మించే ఛాన్స్ ఉందని సమాచారం. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో మెట్రో ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ నష్టాలొస్తున్నాయి. దీంతో లాభ నష్టాలతో సంబంధం లేకుండా… ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించడం కోసం విశాఖ మెట్రోను నిర్మిస్తామని జగన్ సర్కారు చెబుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button