తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Govt: అంగన్ వాడీ కార్యకర్తలకు హెచ్చరిస్తూనే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు ఉద్యమం చేస్తున్నారు. కొన్ని రోజులుగా వీరు చేస్తున్న ఉద్యమం బుధవారం తీవ్ర రూపం దాల్చింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి చేపట్టడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. రోజురోజుకు ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఎట్టకేలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. మంత్రులతో అంగన్ వాడీ కార్యకర్తలు సమావేశమై చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు విఫలమవడంతో వారి ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంగన్ వాడీ కార్యకర్తలకు చేసిన ప్రయోజనాలు, మేలు వంటివి సుదీర్ఘంగా వివరించింది. ఈ మేరకు పలు దినపత్రికలకు ప్రకటన ఇచ్చింది.

Also Read తెలంగాణ ప్రజలెవరూ కరెంట్ బిల్లు కట్టకండి: ఎమ్మెల్సీ కవిత

అంగన్ వాడీ సేవలను కొనియాడుతూనే అంగన్ వాడీ కేంద్రాలు, చిన్నారులు, కార్యకర్తలకు చేసిన పనులు, పథకాలు, కార్యక్రమాల చిట్టా వివరించింది. మీ డిమాండ్లు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. దీంతోపాటు సమ్మె వలన బాలింతలు, గర్భిణిలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన ఇలా ఉంది.

‘ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం.. అన్ని వర్గాల ప్రభుత్వం. 55 నెలల కాలంలో మనసున్న ప్రభుత్వంగా పాలన సాగించాం. ఒక ప్రభుత్వంగా ఎంత మేలు చేయాలో అంతా చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తు.చ తప్పకుండా అమలుచేశామని మీకు గుర్తుచేస్తున్నాం. ఇవ్వని హామీలు కూడా అమలుచేసి అందరిలో సంతోషం నింపే దిశగా అడుగులు వేశాం’ అని ప్రభుత్వం పేర్కొంది.

Also Read ఈ రాజకీయాలు నావల్ల కాదు.. నేను తప్పుకుంటా: గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే

‘మీరంతా మా వాళ్లు, మీకు వీలైనంత మంచి చేయాలన్నదే మా తపన. మీ న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చడానికి కృత నిశ్చయంతో ఉంది. మీరు చేస్తున్న సమ్మె కారణంగా బాలింతలు, గర్భిణిలు, చిన్నారులు పోష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాం’ అని విజ్ణప్తి చేసింది. దీంతోపాటు అంగన్ వాడీ కార్యకర్తలకు హెచ్చరిక కూడా జారీ చేసింది. ‘బాలింతలు, గర్భిణిలు, చిన్నారుల మీద మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వీరి క్షేమం దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాల్సిన పరిస్థితిని తీసుకురావద్దని విజ్ణప్తి చేస్తున్నాం’ అని ప్రభుత్వం హెచ్చరించింది. సమ్మె విరమించాలని మంత్రిమండలి విజ్ణప్తి చేసింది. ఈ ప్రకటనపై అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లు పరిష్కరించకపోగా ప్రభుత్వం బెదిరింపులకు దిగడం దారుణంగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ ప్రకటనను బేఖాతరు చేస్తున్నట్లు.. తమ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని అంగన్ వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button