తెలుగు
te తెలుగు en English
సినిమా రివ్యూ

సినిమా రివ్యూ: ఎక్స్ ట్రార్డినరీ

Pakka Telugu Rating : 2/5
Cast : నితిన్, శ్రీలీల, రావు రమేశ్, రాజశేఖర్, సంపత్ రాజ్, హరితేజ, సుదేవ్ నాయర్‌ తదితరులు
Director : వక్కంతం వంశీ
Music Director : హరీస్ జైరాజ్
Release Date : 08/12/2023

వరుస సినిమాలు చేస్తున్న తెలంగాణ హీరో నితిన్ (Nithin)కు సరైన విజయం దక్కడం లేదు. ‘భీష్మ’తో మోస్తారు హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ నిరాశపర్చాయి. రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలను ప్రేక్షకులు ఆదరించలేదు. ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ ఈసారి వినోదాత్మకంగా ప్రయత్నించాడు. ‘ఎక్స్ ట్రార్డినరీ’ అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. టీజర్, ట్రైలర్లు వినోదం పండించడంతో ప్రేక్షుకుల్లో అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలు సినిమా అందుకుందా? నితిన్ కు హిట్ లభించిందా అనేది తెలుసుకోండి.

కథ
అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా ఉండాలనుకునే కుర్రాడు అభి అలియాస్ అభయ్ (నితిన్). జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ ఎప్పటికైనా హీరో కావాలని కలలుగంటుంటాడు. కానీ దర్శకులు అభిని కెమెరా ముందు కనిపించకుండా చేస్తుంటారు. ప్రతిభ ఉన్నా సరైన గుర్తింపు రావడం లేదని బాధపడుతున్న సమయంలో లిఖిత (శ్రీలీల) పరిచయం అవుతుంది. ఆమె ఓ కంపెనీకి సీఈఓ. లిఖిత పరిచయం అభి జీవితాన్ని మార్చేస్తుంది. అభి కూడా సీఈఓ స్థాయికి ఎదుగుతాడు. ప్రశాంతంగా కొనసాగుతున్న సమయంలో అభికి ఓ యదార్థ సంఘటన ఇతివృత్తంతో కూడిన సినిమా అవకాశం వస్తుంది. హీరో అవకాశం రావడంతో చేస్తున్న ఉద్యోగం, లిఖితను కూడా కాదనుకుని వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్లాక ఆ సినిమాలో అభి కాకుండా వేరే వ్యక్తిని హీరోగా ఎంపిక చేసుకుంటారు. నిరాశ చెందిన అభి జీవితంలో తర్వాత ఏం జరిగింది? అసలు ఆ నిజ జీవిత కథ ఏమిటి? అభి హీరోగా సినిమా చేశాడా అనేది మిగతా కథ.

కథనం-విశ్లేషణ
మంచి చేజింగ్ సీన్ తో సినిమా ప్రారంభమవడంతో ప్రేక్షకులు ఆసక్తికరంగా సినిమాలో లీనమవుతారు. ఈ తరహా కథలు ఇదివరకే వచ్చి ఉన్నాయి. కానీ వినోదాన్నే నమ్ముకున్న దర్శకుడు పలు ట్రెండింగ్ అంశాలను జోడించే ప్రయత్నం చేశాడు. అవి అక్కడక్కడ నవ్వించగా.. పలుచోట్ల బెడిసికొట్టాయి. జూనియర్ ఆర్టిస్ట్ గా అభి పడే ఇబ్బందులు, హీరో ఇంట్లో సన్నివేశాలు నవ్వించాయి. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ ఎపిసోడ్ కృతకంగా ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విద్దామని చేసిన ప్రయత్నాలు విసుగుతెప్పించాయి. స్ఫూఫ్ పాటలు, బాలకృష్ణ చెంపదెబ్బలు, షర్మిల మహిళలపై చేసిన వ్యాఖ్యలు, నరేశ్-పవిత్ర లోకేశ్ ప్రేమ ఇలా ట్రెండ్ అవుతున్న అంశాలను సినిమాలో ప్రస్తావించారు. ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రేక్షకులకు నవ్వులు తెప్పించాయి. ఇక ద్వితీయార్థంపై భారీగా అంచనాలు పెంచేసి అనంతరం ఆ అంచనాలను చేరుకోకుండానే సినిమాను అర్ధంతరంగా ముగించాడు. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చెప్పారు.

నటన
జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో నితిన్ పర్వాలేదనిపించాడు. తనదైన హాస్యంతో ప్రేక్షకుడిని నవ్వించే ప్రయత్నం చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీఈఓ, హీరో తదితర పాత్రలో మెరిశాడు. ఇక లిఖిత పాత్రలో మెరిసిన శ్రీలీలకు కథలో అంత ప్రాధాన్యం లేదు. ఉన్నంత వరకు అందంగా కనిపించింది. ఐజీ పాత్రలో కనిపించిన రాజశేఖర్ నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన నవ్వించే ప్రయత్నం చేశారు. విలన్ పాత్రలో సుదేవ్ నాయక్ భయపెట్టారు. భయానక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. రావు రమేశ్, రోహిణి, బ్రహ్మాజీ, ఆది, సత్యశ్రీ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఎలా తీశారంటే..
‘నా పేరు సూర్య’తో అందరి ప్రశంసలు అందుకున్న వక్కంతం వంశీ విభిన్న కథాంశంతో తీయాలనుకున్న ‘ఎక్స్ ట్రార్డినరీ’ సినిమా మెప్పించలేకపోయింది. వినోదంపైనే దృష్టి పెట్టడంతో కథ గాడీ తప్పింది. సినిమా అందంగా తీసినా బోలెడన్నీ సీన్లు కలగపులగం చేయడంతో కథ పక్కదారి పట్టింది. సినిమాలో లాజిక్కులు వెతకకుంటే మంచిది. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. సాగదీతగా తీసిన సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. హరిస్ జైరాజ్ సంగీతం సినిమాకు తగ్గట్టుగానే ఉంది. చాయాగ్రహణం.. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

వినోదం
నితిన్ నటన

మైనస్ పాయింట్స్

పాత కథ
సెకండాఫ్

పంచ్‌లైన్: అటకెక్కిన వినోదం.. నథింగ్ ఎక్స్ ట్రార్డినరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button