తెలుగు
te తెలుగు en English
తెలంగాణరాజకీయం

Telangana Elections: తెలంగాణ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. ఎన్నికలు అప్పుడే

తెలంగాణ ఎన్నికల నిర్వహణ పై కీలక సమాచారం అందుతోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగటం ఖాయమైందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అక్టోబరు 6న షెడ్యూల్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2018లో.. డిసెంబరు 7న ఎన్నికలు జరిగాయి.

జనవరి 16న శాసనసభ తొలి సమావేశం జరిగింది. దీన్ని బట్టి.. 2024 జనవరి 17లోపు కొత్త శాసనసభ కొలువుదీరాలి. అందుకు అనుగుణంగా ఈ ఏడాది అక్టోబరు మొదటి వారంలో షెడ్యూల్‌ విడుదలయ్యేలా కసరత్తు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ సైతం అక్టోబరు 10లోపు షెడ్యూల్‌ విడుదలవ్వాలి. అంతకు మించి ఆలస్యం జరిగితే.. ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు ముహూర్తం ఖరారైంది.

రాష్ట్రానికి రానున్న కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసు బందోబస్తు వంటి పలు అంశాలను పరిశీలించనుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక నివేదికను సమర్పించనుంది.

ఆ నివేదిక అందిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అక్టోబరు 6న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఆ తేదీన కుదరకపోతే.. అక్టోబరు 10వ తేదీలోపు షెడ్యూల్‌ను జారీ చేస్తారని అంచనా.

తెలంగాణలో ఈ నెల 18 వరకు కొత్త ఓటర్ల నమోదుకు 13.06లక్షల దరఖాస్తులు, పేర్ల తొలగింపునకు 6.26 లక్షల అర్జీలు అందాయి. సవరణలకోసం 7.77 లక్షల దరఖాస్తులు అందినట్లు ఎన్నికల విభాగం అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను ఈనెల 27 లోపు పరిష్కరించి.. అక్టోబరు 4న తుది జాబితాను విడుదల చేస్తారు. గడువు ముగిసినప్పటికీ.. పౌరులు ఎప్పుడైనా దరఖాస్తులు పంపే వెసులుబాటు ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియలకు కనీసం 2 నెలల సమయం అవసరం. దీంతో, అందుతున్న సమాచారం మేరకు డిసెంబర్ తొలి వారంలోనే పోలింగ్..కౌంటింగ్ ఉండే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button