తెలుగు
te తెలుగు en English
క్రికెట్క్రీడలు

Asia Cup 2023: బంగ్లాపై భారత్ ప్రయోగాలు !

ఆసియా కప్‌ సూపర్‌- 4లో చివరి మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే పాకిస్థాన్‌, శ్రీలంకపై విజయాలతో ఫైనల్‌ చేరిన భారత్‌ శుక్రవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ప్రయోగాలు చేసే అవకాశముంది. కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి.. ఇతర క్రికెటర్లను పరీక్షించే ఆస్కారముంది. వచ్చే నెలలో ప్రపంచకప్‌ ఆరంభం నేపథ్యంలో తొలి ప్రాధాన్య జట్టుకే మరింత మ్యాచ్‌ సమయం ఇవ్వాలా? లేదా ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలా? అని జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోందట.

బంగ్లాదేశ్‌తో పోరు కంటే కూడా ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఆడతాడా? అనేదానిపైనే ఎక్కువగా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అతనొస్తే ఇషాన్‌ కిషన్‌ బయటకు వెళ్లక తప్పదు. మరోవైపు కోహ్లీకి విశ్రాంతినిచ్చి సూర్యకుమార్‌ను ఆడించే సూచనలూ ఉన్నాయి. కేఎల్‌ రాహుల్‌ జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ కూడా లయ అందుకున్నప్పటికీ భారీ ఇన్నింగ్స్‌ బాకీ పడ్డాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్‌, జడేజా.. కూడా బ్యాటింగ్ సత్తాను చూపెట్టాల్సి ఉంది. పిచ్‌ మరోసారి స్పిన్‌కే అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ప్రత్యర్థి స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడం భారత్‌కు కీలకం.

సూపర్‌- 4లో గత రెండు మ్యాచ్‌లనూ ప్రేమదాస స్టేడియంలోనే భారత్‌ ఆడింది. అందులో పాక్‌తో మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌ బ్యాటింగ్‌కు చక్కగా సహకరించింది. శ్రీలంకతో పోరు కోసం వాడిన పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే మందకొడి పిచ్‌ పైనే భారత్‌, బంగ్లా మ్యాచ్‌ జరిగే ఆస్కారముంది. మ్యాచ్‌ మధ్యలో వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. కానీ ఆట పూర్తిగా రద్దు కాకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button