తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana Government: గుడ్ న్యూస్.. ఈ నెల 11 నుంచే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డితో కలిసి శనివారం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష నిర్వహించారు.

Also read: Pakistan: పాకిస్తాన్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు.. ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ఎన్నిక

రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా విధి విధానాలను తయారు చేయాలని చెప్పారు. ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ ముందుగా ప్రాధాన్యమివ్వాలని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా, అసలైన అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని అధికారులను అప్రమత్తం చేశారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేయాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా గూడు లేని నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చడం తమ ప్రభుత్వ సంకల్పమని సీఎం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పారు.

సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సీఎం సూచించారు. లబ్ధిదారులు సొంత ఇల్లు తనకు అనుగుణంగా నిర్మాణం చేపట్టినప్పటికీ తప్పనిసరిగా ఒక వంటగది, టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button