తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 24: చరిత్రలో ఈరోజు

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నేడు దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ఠం చేయడంకోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ ఉత్సవాన్ని జరుపుతుంది. కాగా 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తొలిసారిగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రారంభించారు. 1992 లో భారత రాజ్యాంగం 73వ చట్ట సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా గ్రామ, జిల్లా స్థాయిలలో గ్రామ పంచాయతీల ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. 1993 నుంచి అమలులోకి వచ్చింది. ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీలకు పురస్కారాలు అందజేయనున్నారు.

డా. రాజ్ కుమార్ పుట్టినరోజు

కన్నడ చలనచిత్ర నటుడు, గాయకుడు డా. రాజ్ కుమార్ 1929 ఏప్రిల్ 24న మైసూరు రాజ్యంలోని గాజనూరులో జన్మించారు. ఈయన అసలు పేరు డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో అర్ధశతాబ్దం పాటు 200 సినిమాలలో నటించాడు. తన సినిమాలోని పాటలను తానే పాడుకున్నారు. అలాగే ఇతర చిత్రాలకు కూడా గాత్రాన్ని అందించారు. తెలుగులో శ్రీకాళహస్తి మహత్యం సినిమాలో భక్త కన్నప్పగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

సచిన్ టెండుల్కర్ పుట్టినరోజు

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన భారతీయ ఆటగాడు సచిన్ రమేష్ టెండుల్కర్ 1973 బొంబాయిలో జన్మించారు. భారత్ లో క్రికెట్ పట్ల ప్రజలు ఆకర్షితులయ్యేలా కారణమయ్యారు. పాఠశాల స్థాయిలోనే వినోద్ కాంబ్లీతో కలిసి 1988లో 644 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. 1988/89 లో మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబాయి తరపున ఆడారు. 1989లో తొలిసారిగా అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ను పాకిస్తాన్ పై ఆడారు. 1990 ఆగష్టులో ఇంగ్లాండులోని ఓల్డ్ ట్రఫర్డ్ లో జరిగిన మ్యాచ్ లో తన తొలి శతకం నమోదు చేశారు. 1994 మార్చి 27న ఆక్లాండ్ లో తొలి వన్డే మ్యాచ్ ఆడారు. 2003 వరల్డ్ కప్ టోర్నీలో 11 మ్యాచ్ ల్లో 673 పరుగులు సృష్టించారు. చివరిగా 2011 వరల్డ్ కప్ లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో ప్రపంచకప్ ను సాధించి తన చిరకాల కలను నెరవేర్చుకున్నారు.

ఏడిద నాగేశ్వరరావు పుట్టినరోజు

తెలుగు సినిమా ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు 1934 తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జన్మించారు. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. సినీరంగంలో నిర్మాతగా కంటే ముందుగా నటుడిగా ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1962- 1974 మధ్య కాలంలో సుమారు 30 సినిమాల్లో నటించారు. వంద చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. డైరెక్టర్ కె. విశ్వనాథ్ తో కలిసి సిరి సిరి మువ్వ చిత్రాన్ని నిర్మించారు. తర్వాత తన బంధువుతో కలిసి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్థాపించారు. శంకరాభరణం మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందారు.

లారీ టెస్లర్ పుట్టినరోజు

న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త లారీ టెస్లర్ 1945 న్యూయార్క్ లోని ది బ్రోంక్స్ లో జన్మించారు. 1960లో కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో పనిచేసిన టెస్లర్ కంప్యూటర్ లోని సులువైన కంప్యూటర్ కమాండ్లను రూపొందించారు. 1973లో పాలో ఆల్టో రీసెర్చ్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో కట్, కాపీ, పేస్ట్ లాంటి కమాండ్లను రూపొందించారు. ఆపిల్ సంస్థలో లీసా, న్యూటన్, మాకింతోష్ తో కలిసి ఐఫోన్ ఇంటర్ స్పేస్ రూపకల్పన చేశారు.

సత్య సాయి బాబా మరణం

భారతీయ ఆధ్యాత్మికవేత్త సత్యసాయి బాబా 2011 అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కన్నుమూశారు. ఇతనిని గురువు అని, వేదాంతి అని,భగవంతుని అవతారం అని, షిరిడీ సాయిబాబానే మళ్లీ సాయిబాబాగా అవతరించాడని పలువురు విశ్వసిస్తారు. సత్యసాయి బాబా 1926 నవంబర్ 23న అనంతపురం జిల్లా పుట్టపర్తిలో జన్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలున్నాయి.

జె.వి. సోమయాజులు మరణం

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శంకరాభరణం శంకరశాస్త్రిగా పేరుగాంచిన నటుడు జె.వి. సోమయాజులు 2004 హైదరాబాద్ లో మరణించారు. రంగస్థల, వెండితెర, బుల్లితెర నటుడిగా పేరుతెచ్చుకున్న జె.వి. సోమయాజులు 1928 జూలై 30న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం లకలాం గ్రామంలో జన్మించారు. రెవెన్యూ శాఖలో అంచెలంచెలుగా ఎదిగి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి వచ్చారు. 1979 మహబూబ్ నగర్ లో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తుండగా శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా తర్వాత 150 సినిమాల వరకు రకరకాల పాత్రలు పోషించారు.

మరిన్ని విశేషాలు

ప్రపంచంలోనే మొదటి వార్తా పత్రిక అమెరికాలోని బోస్టన్ నగరంలో 1704 లో ప్రారంభించబడింది.

చైనా 1970లో మొదటి ఉపగ్రహం డాంగ్ ఫాంగ్ హాంగ్ 1 ను ప్రయోగించింది.

క్లోనింగ్ ప్రక్రియ ద్వారా 2005 దక్షిణ కొరియాలో కుక్క స్నప్పీ జన్మించింది.

మద్రాసు సంగీత అకాడమీ ముఖ్యులలో ఒకరు విస్సా అప్పారావు 1884 తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు.

తెలుగు పాత్రికేయలు, రచయిత నండూరి రామమోహనరావు కృష్ణా జిల్లా విస్సన్నపేటలో జన్మించారు.

తెలుగు కార్టూన్ చిత్రాల ప్రముఖులు తులసీరాం 1941 కర్నూలు జిల్లా సంజామల మండలం అలువకొండ గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు షరాఫ్ తులసీ రామాచారి. తులసి, రామ, తులసీరాం పేరుతో ప్రసిద్ధి చెందారు.

ప్రముఖ కథా రచయిత చిలుకూరి దేవపుత్ర 1952 అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కాల్వపల్లె గ్రామంలో జన్మించారు.

ప్రముఖ ఫోక్ సింగర్ తీజన్ బాయి 1956 ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ కి 14 కి.మీ. దూరంలోని గనియారి గ్రామంలో జన్మించారు. మహాభారత ఘట్టాలను తన పాట ద్వారా వినిపించేవారు.

భారతీయ నటి, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించిన గజాలా 1985 మస్కట్ లో జన్మించారు. 2001లో జగపతిబాబు కథానాయకుడిగా వచ్చిన నాలో ఉన్న ప్రేమ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. స్టూడెంట్ నెం. 1 మూవీతో బాగా పేరొచ్చింది.

దక్షిణ భారతదేశపు నటి, భారత సినీ చరిత్రలో మొదటి మహిళా నిర్మాతగా పేరు గాంచిన ఎమ్.వి. రాజమ్మ 1999 చెన్నైలో మరణించారు. తెలుగు, తమిళ, కన్నడం భాషలలో కలిపి 100 పైగా చిత్రాలు చేశారు.

సంఘసేవకుడు, దాత, విద్యావేత్త రామినేని అయ్యన్న చౌదరి 2000 సంవత్సరంలో కన్నుమూశారు.

ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు పందిళ్ళ శేఖర్ బాబు 2015 వరంగల్ జిల్లా ధర్మసాగర్ లో మరణించారు.

తెలంగాణకు చెందిన సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి 2023 హైదరాబాద్ లో మరణించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button