తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 30: చరిత్రలో ఈరోజు

అంతర్జాతీయ జాజ్ దినోత్సవం

అంతర్జాతీయ జాజ్ దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసేందుకుగాను 2011లో ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థచే ఈ రోజు జరిపేందుకు నిర్ణయించింది. జాజ్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది జాజ్ సంగీతకారుల చారిత్రక ఘనతలపై ప్రదర్శనలు ఇస్తారు. అందుకు సంబంధించి వర్క్ షాపులు, ఈవెంట్లు, సమావేశాలు, కమ్యూనిటీ ఔట్ రీచ్ నిర్వహిస్తారు.

ఆయుష్మాన్ భారత్ దివస్

కేంద్రంలో 2018 సెప్టెంబర్ 23న ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 30న ఆయుష్మాన్ భారత్ దివస్ ను జరుపుకుంటారు. దేశంలోని 10 కోట్ల కుటుంబాలకు లేదా 50 కోట్ల మంది లబ్ధిదారులకు ఆర్థిక రక్షణ కల్పించే ఆరోగ్య బీమా పథకం. ఆసుపత్రి సంరక్షణ కోసం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షలు సాయం చేయనుంది. సమాజంలోని అణగారిన, బలహీన వర్గాలకు వైద్య సదుపాయాలు అందించడమే ఈ పథకం లక్ష్యం.

దాదాసాహెబ్ ఫాల్కె పుట్టినరోజు

భారతీయ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే- రచయిత, భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 1870 మహారాష్ట్ర సమీపంలోని త్రయంబకేశ్వర్ లో జన్మించారు. ఈయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఈయన మొదటి సినిమా 1913లో వచ్చిన రాజా హరిశ్చంద్ర. తన జీవితంలో 95 ఫీచర్ ఫిల్మ్ లు నిర్మించారు. ఈయన పేరు మీదనే భారత ప్రభుత్వం 1966లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను స్థాపించింది.

శ్రీశ్రీ పుట్టినరోజు

ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీ 1910లో జన్మించారు. ఈయన పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచనల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా, హేతువాది, నాస్తికుడు. మహాప్రస్థానం ఆయన రచనల్లో తన మనసులోని మాటలను రాసే వారు. 1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది.

రోహిత్ శర్మ పుట్టినరోజు

ప్రముఖ భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ 1987 మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించారు. భారత క్రికెట్ టీ20, వన్డే ఫార్మెట్లలో జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీమిండియా జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ.. తొలి సిరీస్ లోనే ప్రత్యర్థి జట్టును మూడు ఫార్మెట్లలో క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ గా ప్రపంచ రికార్డు సాధించారు. అలాగే 2023 ఫిబ్రవరిలో నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ చేసి రోహిత్ శర్మ కెప్టెన్ గా టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మెట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. 2007లో తొలిసారిగా ఐర్లాండ్ తో జరిగే పరిమిత ఓవర్ల మ్యాచ్ కి ఎంపికయ్యారు. వన్డే ఫార్మెట్లలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ గా నిలిచారు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు (264) చేసిన ఆడగాడిగా రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్ లో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ టీం ఐదుసార్లు గెలుచుకుంది.

థియోడర్ విలియం షుల్ట్జ్ పుట్టినరోజు

అమెరికన్ వ్యవసాయ ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత 1902 అమెరికాలోని సౌత్ డకోటా అర్లింగ్టన్ లో జన్మించారు. చికాగో యూనివర్శిటీ ఆఫ్ ఎకనామిక్స్ విభాగానికి ఛైర్మన్ గా వ్యవహరించారు. వ్యవసాయ ఆర్థిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు జరిపారు. మానవ మూలధన సిద్ధాంతం, ఆర్థికాభివృద్ధిలో ఆయన చేసిన కృష్టికి గాను 1979 లో ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

అడాల్ఫ్ హిట్లర్ మరణం

జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ లేదా ఎడాల్ఫ్ హిట్లర్ 1945 జర్మనీలోని బెర్లిన్ లో ఆత్మహత్య చేసుకున్నారు. 1933 నుండి జర్మనీ ఛాన్స్ లర్ గాను, 1934 నుండి మరణించే వరకు జర్మనీ ఫ్యూరర్ గా ఉన్న హిట్లర్ 1889 ఏప్రిల్ 20న ఆస్ట్రియాలోని హంగరీలో జన్మించారు. నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ వ్యవస్థాపకులు.

కేదారిశ్వర్ బెనర్జీ మరణం

ప్రముఖ భౌతిక శాస్త్రవేత, ఎక్స్-రే క్రిస్టలోగ్రఫీ నిపుణులు కేదారిశ్వర్ బెనర్జీ 1975 కలకత్తా శివారులోని బరాసత్ లో మరణించారు. ఈయన 1900లో సెప్టెంబర్ 15న ప్రస్తుత బంగ్లాదేశ్ లోని విక్రంపూర్ ఢాకాలో బెంగాలీలో జన్మించారు.

ఎస్.పి. వై. రెడ్డి మరణం

భారత పార్లమెంట్ మాజీ సభ్యుడు ఎస్.పి.వై. రెడ్డి 2019లో మరణించారు. ఏపీలోని నంద్యాల లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. నంది గ్రూప్ వ్యవస్థాపకులు. ఈయన 1950 జూన్ 4న కడప జిల్లా అంకాలమ్మ గూడూరు గ్రామంలో జన్మించారు. తొలిసారిగా 1991లో బీజేపీ తరపున నంద్యాల లోక్ సభ నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1999 అసెంబ్లీ ఎన్నికలలో నంద్యాల, గిద్దలూరు నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ నుంచి న్యంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్ష మెజారిటీ సాధించారు. 2009, 2014 లోనూ వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. అనంతరం టీడీపీలో చేరారు. 2019 ఎన్నికలలో నంద్యాల సీటు ఆశించి భంగపడి జనసేనలో చేరారు. జనసేన నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

మరిన్ని విశేషాలు

 • మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా 1946లో టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టారు.
 • భారతీయ నౌకాదళంలో ఐఎన్ఎస్ సింధుఘోస్ 1986లో చేరింది.
 • కవి, శతావధాని గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి 1891 ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జన్మించారు.
 • అమెరికన్ ఆర్థికవేత్త సైమన్ కుజ్ నెట్స్ 1901 ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో జన్మించారు. 1922లో అమెరికాకు వలసవెళ్లి పెన్సిల్వేనియా యూనివర్శిటీకి చెందిన వార్టన్ స్కూల్ లో పరిశోధనలు చేశారు. 1971లో అర్థశాస్త్రం నుంచి నోబెల్ బహుమతి సాధించారు.
 • భారతీయ నటి, మోడల్ శ్వేత 1990 బెంగళూరులో జన్మించారు. వృత్తిపరంగా నందితా శ్వేత అని పిలుస్తారు. తమిళ, తెలుగు, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించారు.
 • భారతీయ సినీ గాయని హరిణి 1979 చెన్నైలో జన్మించారు.
  ఈమె తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ సినిమాల్లో దాదాపు 2000 పాటలు పాడారు.
 • లలిత సాహిత్య నిర్మాత, పండితుడు దుర్భాక రాజశేఖర శతావధాని 1957 లో మరణించారు. గడియారం వెంకట శేషశాస్త్రితో కలిసి వేంకట- రాజశేఖర కవులు అనే జంటపేరుతో 1920- 1928 మధ్య కాలంలో అనేక శతావధానాలు నిర్వహించారు.
 • పత్రికా రచయిత అరెకపూడి రమేశ్ చౌదరి 1983లో మరణించారు. హిందీ, ఆంగ్ల భాషలో సమాన ప్రతిభ కలవారు. ఆకాశవాణిలో డిప్యూటీ చీఫ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.
 • ఇండోనేషియాలో శతాధిక వృద్దునిగా (146) భావించబడిన సమర్పాన్ సోడిమెజో (ఎంబా ఘోటో) 2017లో మరణించారు.
 • తెలుగు కవి, సాహితీకారుడు, రచయిత, గీత రచయిత దూసి ధర్మారావు 2017 లో విశాఖ నోవాటెల్ హోటల్ సమీపంలో బీచ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో మరణించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button