తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 29: చరిత్రలో ఈరోజు

అంతర్జాతీయ నృత్య దినోత్సవం

అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని నేడు జరుపుకుంటారు. డాన్స్ విలువ, ప్రాముఖ్యతను తెలిపేందుకు ఈ రోజున పలు రకాల ఉత్సవాలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. అలాగే ఆధునిక బ్యాలెట్ సృష్టికర్తగా ప్రసిద్ధి చెందిన జీన్- జార్జెస్ నోవెర్రే జన్మిదినం సందర్భంగా ఈ రోజును ఎంపిక చేశారు. 1982లో యునెస్కో సంస్థ ఎన్.జి.ఓకి చెందిన ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీచే ప్రారంభించబడింది. పారిస్ లోని యునెస్కో ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తారు.

రాజా రవివర్మ పుట్టినరోజు

భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ 1848 కేరళలోని కిలమానూర్ లో జన్మించారు. రామాయణ, మహాభారతంలోని ఘట్టాలను చిత్రాలుగా మలిచి మంచి గుర్తింపు పొందారు. 1873లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నారు.

ఆండ్రి అగస్సీ పుట్టినరోజు

అమెరికన్ టెన్నిస్ ఆటగాడు, ప్రపంచ నెం. 1 మాజీ ప్లేయర్ ఆండ్రీ కిర్క్ అగస్సీ 1970 అమెరికాలోని నెవాడా లాస్ వెగాస్ లో జన్మించారు. ఎనిమిది సార్లు మేజర్ ఛాంపియన్, ఒలంపిక్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. కేరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన మొదటి వ్యక్తి. కేరీర్ సూపర్ స్లామ్ గెలుచుకున్న ఏకైక వ్యక్తి కూడా ఈయనే.

స్వర్ణలత పుట్టినరోజు

దక్షిణ భారత గాయని స్వర్ణలత (కొత్త) 1973 కేరళలోని పాలక్కాడ్ చిత్తూర్ గ్రామంలో జన్మించారు. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, ఉర్దూ, బెంగాళీ, ఒరియా, పంజాబీ, బాడిగ బాషలలో కలిపి సుమారు 7000 వేల పాటలు పాడారు. 1987లో ఈమెకు తొలిసారిగా పాడే అవకాశం దక్కింది. కరుత్తమ్మ సినిమాలో పొరలె పొన్నుతాయి అనే పాటకు జాతీయ ఉత్తమ గాయని పురస్కారం లభించింది. ఈపాటను ఏ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహించారు.

ఆశిష్ నెహ్రా పుట్టినరోజు

భారత మాజీ క్రికెటర్, క్రికెట్ కోచ్ ఆశిష్ నెహ్రా 1979 ఢిల్లీ కంటోన్మెంట్ లోని సదర్ బజార్ లో జన్మించారు. భారత్ తరపున అన్ని క్రికెట్ ఫార్మట్లలో ఆడారు. 2003 ప్రపంచకప్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ పై జరిగిన మ్యాచ్ లో నెహ్రా 23 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి సత్తా చాటారు. ఇప్పటి వరకు క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో ఒక భారతీయ బౌలర్ చేసిన అత్యుత్తమ బౌలింగ్. ఐసిసి, క్రిక్ఇన్ ఫో 2016 టి20 వరల్డ్ కప్ సిరీస్ లో టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ పేరు సంపాదించుకున్నారు. 2017 చివర్లో నెహ్రా అన్ని రకాల క్రికెట్ ఫార్మెట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉమ్మడి విజేతలలో ఒకరైన భారత జట్టులో సభ్యుడు. 2011 క్రికెట్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఆటగాడు.

ఆర్. విద్యాసాగరరావు మరణం

తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు ఆర్ విద్యాసాగర్ రావు 2017 హైదరాబాద్ లో మరణించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారునిగా పనిచేశారు. ఈయన 1939 నవంబరు 14న సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామాంలో జన్మించారు. నీరు- నిజాలు ఆయన ఇంటిపేరుగా మార్చుకున్నారు. నీటిపారుదల రంగానికి ఆయన చేసిన కృషికి గౌరవ సూచికంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఆర్. విద్యాసాగర్ రావు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా పేరు పెట్టారు. ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాకు సురక్షిత మంచినీరు, తెలంగాణలో ఎండిపోయిన భూములకు నీరందించేందుకు కృషి చేశారు.

ఇర్ఫాన్ ఖాన్ మరణం

భారతీయ నటుడు, నిర్మాత ఇర్ఫాన్ ఖాన్ 2020 ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో పెద్దపేగు ఇన్ఫెక్షన్ కారణంగా కన్నుమూశారు. ఎక్కువగా హిందీ చిత్రాల్లో నటించారు. ఈయన 1967 జనవరి 7న రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించారు. హాలీవుడ్ సినిమాలతో పాటు ఇతర భారతీయ భాషల్లో నటించారు. సినీ విమర్శకులు, సమకాలికులు అతని నటనలో ఉన్న సహజత్వం, వైవిధ్య భరితమైన పాత్రల ఆధారంగా ఆయనను భారతీయ నటుడిగా ఉత్తమ నటుడిగా నిలబెట్టాయి. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడ సినిమాలో నటించారు.

తర్సామీ సింగ్ సైనీ మరణం

భారతదేశానికి చెందిన గాయకుడు తర్సామీ సింగ్ సైనీ 2022 హెర్నియా వ్యాధితో బాధపడుతూ యూకేలోని లండన్ లో మరణించారు. ఈయన 1967 మే 23న యూకేలోని వెస్ట్ మిడ్ ల్యాండ్స్ కోవెంట్రీలో జన్మించారు. 1989లో హిట్ ది డెక్ అనే ఆల్బమ్ తో అరంగ్రేటం చేశారు. 1990 దశకంలో ఎన్నో పాటలు పాడారు.

మరిన్ని విశేషాలు

ప్రముఖ పండితుడు, సంఘ సంస్కర్త, రచయిత బంకుమల్లె మల్లయ్యశాస్త్రి 1876 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామంలో జన్మించారు.

ఉయ్యూరు జమీందారు, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు రాజ మేకా వెంకటాద్రి అప్పారావు 1893 కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు.

ఎ.జి.కె.గా ప్రసిద్ధి చెందిన హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి 1917 గుంటూరు జిల్లా తెనాలి తాలుకా మూల్పూరు గ్రామంలో జన్మించారు.

స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది, ఏపీ మాజీ శాసనసభ్యులు వావిలాల గోపాలకృష్ణయ్య 2003లో మరణించారు. పద్మభూషణ్, కళా ప్రపూర్ణ బిరుదు గ్రహీత అయిన గోపాలకృష్ణయ్య 1906 సెప్టెంబరు 17న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జన్మించారు.

అమెరికన్ ఆర్థికవేత్త, దౌత్యవేత్త జాన్ కెన్నెత్ గాల్ బ్రెయిత్ 2006లో కన్నుమూశారు. గాల్ బ్రెయిత్ 1908 అక్టోబర్ 15న కెనడాలోని అంటారియోలో జన్మించారు.

తెలుగు సినీ దర్శకుడు గుత్తా రామినీడు 2009 చెన్నైలో మరణించారు. తెలుగులో ఎన్నో మంచి చిత్రాలను తెరకెక్కించారు. హైదరాబాద్ లో సారథి స్టూడియో వ్యవస్థాపకులు. ఈయన 1929 అక్టోబర్ 5న ఏలూరు మండలం చాటపర్రు గ్రామంలో జన్మించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button