తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

ఏప్రిల్ 12: చరిత్రలో ఈరోజు

అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం

అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవాన్ని తొలిసారిగా 2011లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన సర్వసభ్య సమావేశం 65వ సెషన్ లో ప్రకటించారు. యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపబడుతుంది. 1961 లో యూరి గగారిన్ వోస్టోక్ 1 అంతరిక్ష విమానంలో ప్రయాణించి, వోస్టోక్- కే ప్రయోగించిన వోస్టోక్ 3కెఎ అంతరిక్ష నౌకలో 108 నిమిషాలపాటు భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించాడు.

వర్థమాన మహావీరుడు పుట్టినరోజు

జైన మతాన్ని పునరుద్ధరించిన 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు క్రీ.పూ. 599 సంవత్సరంలో జన్మించాడు. పూర్వ వైదిక శకంలోని తీర్థంకరుల ఆధ్యాత్మిక, తాత్విక, నైతిక బోధనలను ఆయన వివరించాడు. జైన సంప్రదాయంలో భారతదేశంలోని బీహార్ లోని వైశాలీ నగరం సమీపంలో క్షత్రియ కుటుంబంలో జన్మించినట్లు నమ్ముతారు. 30 ఏళ్ల వయస్సులోనే ఆధ్యాత్మిక సన్యాసిగా మారాడు. వీరి ప్రకారం సమ్యక్ దర్శనం, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ జీవనం అనేవి మోక్షమార్గాలు. వీటినే త్రిరత్నాలు అంటారు. పార్శ్వనాథుడు ప్రతిపాదించిన అహింస, సత్యం, అపరిగ్రహం, అస్థేయం అనే నాలుగింటికి బ్రహ్మచర్యం అనేదానిని వర్ధమానుడు కలిపాడు. ఈ ఐదింటిని పంచవ్రతాలు అంటారు. వీటిని పాటిస్తూ త్రిరత్నాలతో జీవించిన వారికి కైవల్యం లభిస్తుందని జైనం బోధిస్తుంది.

వినూమన్కడ్ పుట్టినరోజు

భారత జట్టు మాజీ క్రికెటర్ వినూమన్కడ్ 1917 జామ్ నగర్ లో జన్మించాడు. భారతదేశం తరఫున ఇతను 44 టెస్టులు ఆడి 31.47 సగటుతో 2109 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో అతని అత్యధిక స్కోరు 231 పరుగులు. బౌలింగ్ లో 32.32 పరుగుల సరాసరితో 162 వికెట్లు తీశాడు. ఇందులో 8 సార్లు 5 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో ఓపెనర్ నుంచి చివరి వరస బ్యాట్స్‌మెన్ దాకా ఏ స్థానంలో నైనా బ్యాటింగ్ చేసిన ముగ్గురు భారతీయులలో ఇతను ఒకడు.

మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం

భారతదేశ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1962 లో మరణించారు. ఈయన 1861 సెప్టెంబర్ 15న చిక్కబళ్ళాపూర్ తాలుకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో జన్మించారు. వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందిన వారు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశారు. 1955లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న లభించింది. అతను ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ (Knight commander of the order of Indian empire (KCIE)) బిరుదునిచ్చి సత్కరించాడు. మైసూరులో గల ఆనకట్ట కృష్ణరాజ సాగర్ కు అతను ఛీఫ్ ఇంజనీరుగా పనిచేశారు. హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించారు. విశాఖ రేవును సముద్రపు కోత నుంచి రక్షించే వ్యవస్థ రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది.

డా. రాజ్ కుమార్ మరణం

కన్నడ చలనచిత్ర నటుడు, గాయకుడు డా. రాజ్ కుమార్ 2006 బెంగళూరులో మరణించారు. ఈయన 1929 ఏప్రిల్ 24న మైసూరు రాజ్యంలోని గాజనూరులో జన్మించారు. ఈయన అసలు పేరు డా. సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజు. కన్నడ చలనచిత్ర పరిశ్రమలో అర్ధశతాబ్దం పాటు 200 సినిమాలలో నటించాడు. తన సినిమాలోని పాటలను తానే పాడుకున్నారు. అలాగే ఇతర చిత్రాలకు కూడా గాత్రాన్ని అందించారు. తెలుగులో శ్రీకాళహస్తి మహత్యం సినిమాలో భక్త కన్నప్పగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

మరిన్ని విశేషాలు

తమిళనాడుకు చెందిన భారత కాంగ్రెస్ నాయకుడు, సమాజసేవకుడు సేలం పగడాల నరసింహులునాయుడు 1854 ఈరోడ్ లో జన్మించారు.

కథకుడు, అనువాదకుడు, నవలా రచయిత, సాహిత్యవేత్త అల్లూరి పిచ్చేశ్వరరావు 1925 కృష్ణా జిల్లా చౌటపల్లిలో జన్మించారు.

నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు అమరపు సత్యనారాయణ 1936 విజయనగరం జిల్లా తెర్లాం మండలం పాములవలసలో జన్మించారు.

రచయిత, కవి, నాస్తికుడు జ్వాలాముఖి (వీరవెల్లి రాఘవాచార్య) 1938 మెదక్ జిల్లా ఆకారం గ్రామంలో జన్మించారు.

అమెరికా 32 వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్ వెల్డ్ 1945 లో మరణించారు.

ఆధ్యాత్మిక గురువు ఎక్కిరాల భరద్వాజ 1989 ఒంగోలులోని సాయిమందిరంలో నిర్యాణం చెందారు.

రాజ్యసభ సభ్యుడు, సీపీఐ నేత మాకినేని బసవపున్నయ్య 1992 ఢిల్లీలో మరణించారు.

రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ 1961లో ఉపగ్రహంలో ప్రయాణించి అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవుడిగా పేరు గాంచాడు.

ప్రపంచంలోని మొట్టమొదటి స్పేస్ షటిల్ కొలంబియాను 1981లో అమెరికా విజయవంతంగా ప్రయోగించింది.

థాయ్ లాండ్ దేశం పట్టాయ నగరంలో 2009లో ఆసియన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం జరిగింది.

ప్రపంచ కబడ్డీ పోటీల్లో 2010 పంజాబ్ లోని లూథియానా గురునానక్ స్టేడియంలో భారత్ జట్టు పాకిస్థాన్ జట్టును ఫైనల్లో 58-24 తేడాతో ఓడించి మొదటిసారి విజయం సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button