తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

మార్చి 1: చరిత్రలో ఈరోజు

బిహార్ సీఎం నితీశ్ కుమార్ పుట్టినరోజు

భారత రాజకీయాల్లో నితీశ్ కుమార్ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. బిహార్ రాష్ట్రానికి 9వ సారి ముఖ్యమంత్రిగా ఆయన ఇటీవల ప్రమాణస్వీకారం చేసి రికార్డు సృష్టించారు. నితీశ్ 1951 మార్చి 1న భక్తిపూర్‌లో జన్మించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలుసార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన 1972లో బిహార్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా సేవలందించారు.

ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య పుట్టినరోజు

ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య. 1901లో పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని జొన్నలగడ్డ గ్రామంలో జన్మించారు. 1952లో నరసరావుపేట నియోజకవర్గం నుండి కాసు వెంగళరెడ్డిపై పోటీ చేసి శాసనసభ్యునిగా గెలుపొందారు. 1953 అక్టోబరు 1న స్పీకర్ పదవికి ఎన్నిక జరగగా కండవల్లి కృషారావుపై వెంకటరామయ్య విజయం సాధించారు. తొలి శాసనసభ స్పీకర్‌గా వెంకటరామయ్య చరిత్రలో నిలిచిపోయారు.

మహారాష్ట్ర మాజీ సీఎం వసంతరావు బందుజీ పాటిల్ మరణం

మహారాష్ట్ర మాజీ సీఎం వసంతరావు బందుజీ పాటిల్ 1989లో మరణించారు. ఈయన 1917లో నవంబర్ 13న ముంబైలోని సాంగ్లీ ప్రాంతంలో జన్మించారు. 1937 నుండి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 1972 నుండి 1976 వరకు ముఖ్యమంత్రి వసంతరావు నాయక్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1976- 1985 మధ్య మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1980లో సాంగ్లీ (లోక్‌సభ నియోజకవర్గం) నుండి 7వ సారి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

తాడూరి బాలాగౌడ్ మరణం

నిజామాబాద్ లోక్‌సభ మాజీ ఎంపీ తాడూరి బాలాగౌడ్. 2010లో మరణించారు. ఈయన 1931లో అక్టోబర్ 2న నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం ఐలాపురంలో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. 1978లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికై టి.అంజయ్య, భవనం వెంకట్రామ్ మంత్రివర్గాల్లో 1982 వరకు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1983లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 1984లో, 1989 లో రెండు పర్యాయాలు నిజామాబాద్ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

మరికొన్ని విశేషాలు

  • భారతీయ రైల్వేలో మొదటిసారిగా 1969లో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టారు. మొదటి రైలు ఢిల్లీ- కలకత్తా మధ్య ప్రారంభమైంది.
  • అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఇంటర్నేషనల్ మానిటరి ఫండ్)ను 1947 వాషింగ్టన్ డీసీలో ప్రారంభించారు. ఇందులో 190 దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇది ప్రపంచంలో ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, అధిక ఉపాధిని, స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడానికీ కృషి చేస్తుంది.
  • భారత వెయిట్ లిఫ్టర్ నమీరాక్ పామ్ కుంజరాణి దేవి పుట్టినరోజు. ఈమె 1968లో మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్‌లోని కైరాంగ్ మాయై లేకాయ్‌లో జన్మించారు. వెయిట్ లిఫ్టింగ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించింది. అనేక రికార్డులు నెలకొల్పింది. 1990లో అర్జున అవార్డును, 1996-1997 సంవత్సరానికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును లియాండర్ పేస్‌తో కలిసి పంచుకున్నారు.
  • ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ ఎన్.సి. కారుణ్య 1986, మార్చి 1 జన్మించారు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి. నాలుగేళ్లకే సంగీతంలో శిక్షణ పొందాడు. ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసిన తర్వాత పూర్తి సమయాన్ని సంగీతానికి కేటాయించారు. ఈటీవీలో నిర్వహించిన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో విజేతగా నిలిచి పాపులర్ అయ్యారు. అనంతరం పలు సినిమాలకు పాటలు పాడారు. ఎందుకో పిచ్చిపిచ్చిగా నచ్చావే (చిరుత), ఓల ఓల (ఆరెంజ్), వయ్యారాల జాబిల్లి (తీన్‌మార్) పాటలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియన్ ఐడల్ రెండో ఎడిషన్‌లో పాల్గొని సెకండ్ విన్నర్‌గా నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button