తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

OU Students: ఓయూ విద్యార్థుల ఆశాకిరణం ’కాంగ్రెస్ పార్టీ‘.. ఎన్నికల్లో మద్దతు

స్వరాష్ట్ర తెలంగాణ (Telangana) కోసం త్యాగాలు చేసింది ముమ్మాటికీ విద్యార్థులే. వారి చదువులు, పరీక్షలు పక్కన పెట్టి మరీ ఉద్యమంలో నిప్పుకణికలు అయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ ఉద్యమాన్ని సజీవంగా ఉంచిందే విద్యార్థులు. స్వరాష్ట్ర సాధనలో విద్యార్థుల పాత్ర చెరగనది. అందులో ఉస్మానియా విశ్వవిద్యాలయ (Osmania University) విద్యార్థుల పోరాటం చరిత్రాత్మకం. అంతటి ఓయూను అధికార బీఆర్ఎస్ పార్టీ విస్మరిస్తోంది. ఓయూ (OU) అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపడం లేదు. అసలు విద్యార్థుల సమస్యలు, వారికి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యతపై సీఎం కేసీఆర్ (KCR) దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో ఓయూ విద్యార్థులంతా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాంటి పార్టీని ఓడించాలని కంకణబద్దులయ్యారు. సీఎం కేసీఆర్ ను గద్దెదించేందుకు ఏకమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) బీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విద్యార్థులు, నిరుద్యోగులు ప్రచారం చేస్తున్నారు.

Also Read బీఆర్ఎస్ కు మద్దతు పలకాలని ’ఉద్యోగి‘కి వేధింపులు.. ఈసీకి ఫిర్యాదు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒకటి, రెండు మినహా మిగతా విద్యార్థి సంఘాలన్నీ కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాయి. ఆ సంఘాల నాయకులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగాలు కల్పించని కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిస్తున్నారు. కేసీఆర్ మళ్లీ వస్తే మాలాగా మీ పిల్లలు కూడా నిరుద్యోగులుగా (Unemployees) మిగులుతారని చెబుతున్నారు. ఓయూ విద్యార్థులు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (Zaheerabad) నియోజకవర్గంలో ఓయూ విద్యార్థి నాయకుడు బేగరి విష్ణు ఆధ్వర్యంలో విద్యార్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఊరూరా తిరుగుతూ బీఆర్ఎస్ చేస్తున్న మోసాలు వివరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని.. కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు.

Also Read డీప్ ఫేక్ వీడియోలు దేశానికి తీవ్ర ముప్పు: మోదీ

మంచిర్యాల జిల్లా చెన్నూరులో (Chennur) ఓయూ జేఏసీ నాయకులు ప్రచారం విస్తృతంగా చేస్తున్నారు. ఒకప్పటి ఓయూ విద్యార్థి బాల్క సుమన్ (Balka Suman) బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండగా అతడికి వ్యతిరేకంగా ఓయూ విద్యార్థులు పని చేస్తుండడం గమనార్హం. విద్యార్థి నేతగా ఎదిగిన బాల్క సుమన్ అధికార పార్టీలో ఉండి కూడా విద్యార్థులు, నిరుద్యోగులకు ఏమీ చేయలేదని ఓయూ జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు చదువుకున్న ఓయూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేయలేదని సుమన్ పై మండిపడ్డారు. అందుకే అతడిని ఓడించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు.

ఓయూ విద్యార్థి నాయకుడిగా ఎదిగి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజు (Guvvala Balaraju) ఎన్నికయ్యాడు. అతడు కూడా ఓయూ విద్యార్థుల సమస్యలపై స్పందించలేదు. ఇటీవల ఓయూ నుంచి పీహెచ్ డీ (PhD) తీసుకున్నాడు.. కానీ ఓయూ సమస్యలపై ప్రభుత్వంపై చర్చించలేదనే ఆగ్రహంతో ఉన్నారు. బాలరాజు తీరుపై మండిపడుతూ అచ్చంపేటలో (Achampet) ఓయూ విద్యార్థులు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు.

Also Read: తుఫాన్ లో కేసీఆర్ కొట్టుకుపోతాడు: రాహుల్ గాంధీ

మునుగోడు (Munugode) నియోజకవర్గంలో ఓయూ నాయకుడు సత్యనారాయణ ఎన్నికల బరిలో నిలిచాడు. కేసీఆర్ మోసాలను వివరిస్తూ భిక్షగాడి వేషంలో కనిపించి ఆకట్టుకున్నాడు. కేసీఆర్ ను ఓడించేందుకు తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించాడు. ఇక తుంగతుర్తి, పెద్దపల్లి, మక్తల్ (Makthal), మహబూబ్ నగర్, మిర్యాలగూడతోపాటు ఖమ్మం జిల్లాలో కొన్ని స్థానాలు కలిపి మొత్తం 20కి పైగా నియోజకవర్గాల్లో ఓయూ విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీ ఓటమి కోసం పని చేస్తున్నారు. వారంతా కాంగ్రెస్ తో కలిసి కట్టుగా పని చేస్తున్నారు. ఓయూ విద్యార్థుల ప్రచారంతో ఓటర్లలో మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button